కృష్ణవేణి ఘాట్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, తదితరులు
సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 7 నుంచి ప్రారంభమయ్యే దసరా మహోత్సవాలను కోవిడ్ నిబంధనల మేరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఇందుకు సంబంధించి గురువారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ జే నివాస్ మాట్లాడుతూ.. దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నట్లుగా సర్టిఫికెట్‌ను వెంట తెచ్చుకోవాలని సూచించారు. అలాగే, భవానీలు తమతమ స్వస్థలాల్లోనే దీక్ష విరమణ చేయాలన్నారు. కొండపైకి వాహనాలను అనుమతించబోమని, వీఐపీ భక్తులకోసం 15 వాహనాలను ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక మూలా నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల వీఐపీ, ప్రొటోకాల్, బ్రేక్ దర్శనాలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు.
తెల్లవారుజాము నుంచే దర్శనాలు
మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉచిత దర్శనం ద్వారా 4 వేలు, రూ.300 టికెట్‌పై 3 వేలు, రూ.100 టికెట్‌పై మరో 3 వేల మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్ర వేడుకగా దేవస్థానం దసరా ఉత్సవాలను నిర్వహిస్తోందని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్ చెప్పారు. తొలుత వీరంతా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఉత్సవ పనులను ఆలయ ఈవో భ్రమరాంబ వివరించారు. సమావేశంలో దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాస్, మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్,, జేసీ మాధవీలత, వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment