సాక్షి, అమరావతి : చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే విజయవాడ నగరం ఎప్పుడూలేని విధంగా ముంపునకు గురైందని వైఎస్సార్‌సీపీ నేతలు మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంవల్ల రాష్ట్రంతోపాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కృష్ణా, ఉప నదులకు భారీ ఎత్తున వరద వచ్చే అవకాశముందని ఐఎండీ, సీడబ్ల్యూసీ ముందస్తుగా హెచ్చరించినా.. ముంపు ముప్పు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు.
ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుడమేరు లాకులు ఎత్తేయడంవల్లే విజయవాడ ముంపునకు గురైందని ఫైర్ అయ్యారు. జలదిగ్బంధంలో చిక్కుకుని సహాయం కోసం ప్రజలు అర్థిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌లో బిజీగా ఉన్నారా? అని వారు ప్రశ్నించారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో.. బాధితులకు సహాయం అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం కంటే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే ముందుండి చేస్తున్నారని చెప్పారు.
తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. వారు ఇంకా ఏమన్నారంటే.. నిన్న కొండచరియలు విరిగిపడి ఐదుగురు చనిపోయారు. వారిని పరామర్శించిన వారులేరు. కరెంట్ లేదు.. నిత్యావసర వస్తువుల్లేవు.. ఇదేనా పాలన? విజయవాడ నగరంలో మీ కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ప్రజలు మాకు ఫోన్లుచేసి సాయం కోరుతున్నారు. మేమంతా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాం. అధికార్లు కూడా మా ఫోన్లు ఎత్తడంలేదు. గతంలో సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ ఉంటే ముందే ప్రజలను అప్రమత్తం చేసేవారు. కానీ, ఇప్పుడు ఆ వ్యవస్థల్లేవు. కూటమి ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా మేం ప్రజల తరఫున పోరాటం చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment