మార్గదర్శిలో ఇంకా డిపాజిట్ల సేకరణ  | Vundavalli Aruna Kumar Comments On Margadarsi chit fund | Sakshi
Sakshi News home page

మార్గదర్శిలో ఇంకా డిపాజిట్ల సేకరణ 

Published Sun, Nov 20 2022 3:33 AM | Last Updated on Sun, Nov 20 2022 3:33 AM

Vundavalli Aruna Kumar Comments On Margadarsi chit fund - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: ‘మార్గదర్శి చిట్‌ఫండ్‌లో డిపాజిట్ల సేకరణ ఆపేసినట్లు 2006లో రామోజీరావు ప్రకటించారు. తీసుకున్న వాటిని తిరిగి చెల్లిస్తామని హైకోర్టు, సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ సైతం వేశారు. కానీ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పటికీ డిపాజిట్లు సేకరిస్తూనే ఉన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి’ అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆరోపించారు. డిసెంబర్‌ 2న మార్గదర్శి కేసు విచారణకు రానున్న నేపథ్యంలో శనివారం ఆయన రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మార్గదర్శి చిట్‌ఫండ్‌ పేరిట డబ్బులు సేకరించారని, గతంలో డిపాజిట్‌ అని ఉంటే.. ప్రస్తుతం దాన్ని రిసీట్‌గా మార్చి వసూలు చేస్తున్నారని వెల్లడించారు. ‘డిపాజిట్లు తీసుకోను’ అని ఆర్‌బీఐకి రాసిచ్చిన వ్యక్తి.. చిట్‌ఫండ్‌ పేరు మీద ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ మీదే రశీదు సైతం ఇస్తున్నారన్నారు.

ఇలా సేకరించిన డబ్బును ఇతర వ్యాపారాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ‘బ్యాలెన్స్‌ షీట్‌లో మార్చి 31 నాటికి అవుట్‌ స్టాండింగ్‌ రూ.139 కోట్లు చూపించారు. అంటే చీటీ పాడుకున్న కస్టమర్లు ఏప్రిల్‌లో కట్టాల్సిన సొమ్మును మార్చి నెలలోనే ముందస్తుగా కట్టారా? మార్గదర్శికి 3 శాతం మంది కూడా డిఫాల్టర్లు లేరా? అందులో ఏదో కిటుకు దాగుంది’ అని అన్నారు. ఉండవల్లి ఇంకా ఏమన్నారంటే.. 
 
తప్పులకు మీడియా ముసుగు 
► పెద్ద బ్యాంకులు, సహకార శాఖలకు సాధ్యం కాని వసూళ్లు ఇక్కడ జరుగుతున్నాయా? మనీ ల్యాండరింగ్‌ జరుగుతోందా? కట్టకుండానే కట్టినట్లు చూపిస్తున్నారా? దీనిపై ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందా? రామోజీ అంటే ప్రభుత్వానికి, అధికారులకు భయమా? 

► ఇలాంటి వ్యక్తికి బ్యాంకులను అప్పగిస్తే అద్భుతంగా నడిపిస్తారేమో! రామోజీ తెలివితేటలకు పద్మ విభూషణ్‌ కాదు.. భారతరత్న ఇవ్వాలి. మార్గదర్శి కేస్‌ స్టడీని విదేశాల్లో యూనివర్సిటీ విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చాలి. 

► రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మార్గదర్శి కేసులో ఇంప్లీడ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి కార్యాలయాల్లో తనిఖీలు చేస్తోంది. దీనిపై.. రామోజీరావు టీడీపీకి అనుకూలంగా ఉంటాడని, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి.. ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని.. అందుకే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపట్టిందని ఆయన పేపర్లో రాసుకుంటాడు. 

► 2007లో ఇదే వాదనతో సుప్రీంకోర్టుకు వెళ్తే.. అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జి రవీందర్‌ ‘రామోజీరావు రెండు టోపీలు పెట్టుకుని తిరుగుతున్న వ్యక్తి. పారిశ్రామికవేత్తగా చేసిన తప్పులను ప్రభుత్వం పట్టుకుంటే మీడియా టోపీ పెట్టుకుని నేను జర్నలిస్ట్‌ కాబట్టి టార్గెట్‌ చేస్తున్నారని మీడియా ముసుగులో తప్పులను కప్పిపుచ్చుకుంటున్నాడు. నువ్వు తప్పు చేశావా? లేదా? అనేది అవసరం. రాజశేఖరరెడ్డి పేరు పర్సనల్‌గా పెట్టింది తీసేస్తున్నాం’ అని చెప్పింది చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 
 
సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జిలతో విచారించాలి 
► మార్గదర్శి కుంభకోణంపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జిలతో కమిటీ వేసి విచారణ జరిపించాలి. ఆ స్థాయి వ్యక్తులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తారు. ఇటీవల రిటైర్డ్‌ అయిన ఎన్‌వీ రమణ.. మార్గదర్శి రికార్డులు పరిశీలించి రామోజీ చేస్తున్నది కరెక్ట్, ఉండవల్లి తప్పుడు వ్యాఖ్యలు  చేస్తున్నారని చెబితే నేను స్వాగతిస్తా. 

► రాష్ట్ర ప్రభుత్వం నన్ను పిలిస్తే.. వారు స్వాధీనం చేసుకున్న రికార్డులు నేనూ చూస్తాను. లేదా ఆర్టీఐ ద్వారా ఇచ్చే వెసులుబాటు కలిగినవి నాకివ్వాలి. అప్పుడు నా ద్వారా మరింత సమాచారం అందే అవకాశం ఉంటుంది. ఎవరి డబ్బులు వారికి ఇచ్చేశామని రామోజీ చెబుతున్నారు.. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాను. రామోజీరావు ఈ విషయం నిరూపించాలి. 

► రామోజీపై ఆరోపణలు చేస్తుంటే నేనూ, జగన్‌ కలిసిపోయామని వార్తలొస్తున్నాయి. చంద్రబాబు, జగన్‌ చేసిన మంచి పనులు ప్రచారం చేసేందుకు మీడియా ఉంది. చంద్రబాబు చేసిన తప్పులు బయటకు రాకపోవడం వల్లే అప్పట్లో బాబును విమర్శించాల్సి వచ్చింది. ప్రస్తుతం జగన్‌పై వ్యతిరేక వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. జగన్‌కు వ్యతిరేకంగా ఈనాడు అన్ని వార్తలు రాస్తున్నా ప్రభుత్వ ప్రకటనలు మాత్రం తగ్గాయా?  సర్క్యులేషన్‌ నిబంధనల ప్రకారం ప్రకటనలు ఇవ్వాల్సిందే. ఈ లెక్కన మార్గదర్శిలో సైతం చట్టానికి లోబడే కార్యకలాపాలు నడవాలన్నదే నా ఉద్దేశం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement