అలవిగాని హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు
ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ రూ.15 వేలు ఇస్తానని హామీ
ప్రతి మహిళకూ నెలకు రూ.1,500.. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ
అన్నదాతలకు రూ.20 వేల చొప్పున రైతు భరోసా సాయం
మత్స్యకారులకు రూ.20 వేల చొప్పున మత్స్యకార భరోసా
ఈ పథకాలన్నీ ఎప్పుడిస్తారని అడుగుతున్న జనం
దిక్కుతోచకే అరాచకాలు, దాడులు, హత్యలు, హత్యాయత్నాలకు ఊతం
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు
జగన్ సీఎంగా ఉండి ఉంటే ఇప్పటికే ఈ పథకాలన్నీ అమలు
సాక్షి, అమరావతి: అలవిగాని హామీలిచ్చి, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వ చ్చిన చంద్రబాబు నాయుడు.. వాటిని అమలు చేయలేక వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే విధ్వంసాలు, దాడులు, హత్యలు, హత్యాయత్నాలను ప్రోత్సహిస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేయిస్తూ.. దిగజారిన రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీకి చెందిన వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు తప్పుడు వాగ్దానాలతో, ప్రజలను మోసం చేసి సీఎం అయ్యారన్నారు. ‘గత ప్రభుత్వంలో ప్రతి త్రైమాసికానికీ విద్యా దీవెన అందించాం. జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికానికి సంబంధించిన విద్యా దీవెన ఇంకా ఇవ్వలేదు. ఏప్రిల్, మే, జూన్ కూడా అయిపోయింది. రెండు త్రైమాసికాల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. అదే జగన్ సీఎంగా ఉండి ఉంటే ఏప్రిల్‌లో వసతి దీవెన, రైతు భరోసా, అమ్మ ఒడి, సున్నా వడ్డీ, మత్స్యకార భరోసా డబ్బులు ఇప్పటికే వచ్చి ఉండేవి. ఈ రోజు ప్రతి అక్కచెల్లెమ్మ ఎదురు చూస్తోంది.
‘పిల్లలను బడికి పంపితే జగన్ ఒక్కరికే అమ్మ ఒడి కింద రూ.15 వేలు చొప్పున ఇస్తాడు. అదే నేను అధికారంలోకి వస్తే ఎంత మంది పిల్లలను బడికి పంపితే అంత మందికి అమ్మ ఒడి ఇస్తాం’ అని చంద్రబాబు చెప్పారు. ఇంట్లో నలుగురు పిల్లలుంటే నలుగురికి రూ.15 చొప్పున రూ.60 వేలు ఇస్తాం అని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల్లో చెప్పినట్టు 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి నెలకు రూ.1,500 ఇవ్వండని ఈ రోజు ప్రతి అక్కచెల్లెమ్మ అడుగుతోంది. ఈ రోజున రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రకారం 2.10 కోట్ల మందికిపైగా అక్కచెల్లెమ్మలు ఉన్నారు.
ఇందులో పెన్షన్‌లు తీసుకుంటున్న వారిని పక్కన పెట్టినా 1.50 కోట్ల మంది మాకు రూ.1,500 ఎప్పుడిస్తావ్ అని నిలదీస్తున్నారు. ప్రతి పిల్లాడు అడుగుతున్నాడు. జగన్ మామ మా అమ్మకు రూ.15 వేలు ఇచ్చేవాడు.. మీరు తల్లికి వందనం ఇస్తాం అన్నారు. ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. 50 లక్షల మంది రైతన్నలు పెట్టుబడి సాయం ఏమైందంటున్నారు.
ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన సున్నా వడ్డీ డబ్బులు ఎందుకు ఇవ్వలేదని అక్కచెల్లెమ్మలు అడుగుతున్నారు. కాలేజీల్లో చదివిన పిల్లలకు సర్టిఫికెట్‌లు ఇవ్వడం లేదు. మత్స్యకార భరోసా రూ.20 వేల చొప్పున ఎప్పుడిస్తారని మత్స్యకారులు అడుగుతున్నారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే విధ్వంసం సృష్టిస్తున్నారు’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment