
సాక్షి, అమరావతి: తిరుపతి ఉపఎన్నికల్లో టీడీపీ సోషల్ మీడియా ప్రచారంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'సాహో చంద్రబాబు' అనే ఫేస్‌బుక్ పేజీ మీద వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ ఫేస్‌బుక్ పేజీ నారా లోకేశ్ స్వీయ పర్యవేక్షణలో నడుస్తోందని తెలిపారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదిలా వుంటే తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక కోవిడ్ నిబంధనలను పటిష్టంగా పాటిస్తూ ఏప్రిల్ 17న జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా పోలింగ్ సాగనుంది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చిత్తూరు జిల్లాలోని మూడు, నెల్లూరు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 17,11,195 మంది ఓటర్లు ఉండగా, అందులో 8.38 లక్షలమంది పురుష ఓటర్లు, 8.71 లక్షలమంది మహిళా ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రం ఎక్కడుందో ఓటరు తెలుసుకునే విధంగా ‘మే నో పోలింగ్ స్టేషన్' యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.