ప్రొద్దుటూరు క్రైం : ఎందరో అనాథలు, అభాగ్యులను చేరదీసి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన డాడీ హోం వ్యవస్థాపకుడు రాజారెడ్డి (52) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పూజాస్కూల్ ప్రాంగణంలో పడి ఉండగా ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు, సన్నిహితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపాళెం మండలంలోని పర్లపాడు గ్రామానికి చెందిన నల్లదిమ్ము రాజారెడ్డి సుమారు 20 ఏళ్ల నుంచి మైలవరంలో డాడీ హోం నిర్వహిస్తున్నారు. ఆయన పెళ్లి చేసుకోలేదు.
పెద్దముడియం మండలంలోని పాలూరు గ్రామంలో చర్చి ఫాదర్‌గా కొనసాగుతున్నారు. అనాథ, ఎయిడ్స్ బారిన పిల్లలతోపాటు వృద్ధులకు డాడీ హోంలో ఆశ్రయం కల్పించి వారి పోషణా బాధ్యతలను చూస్తున్నారు. అలాగే ప్రొద్దుటూరు మండలంలోని చౌడూరు గ్రామం సమీపంలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో పూజా ఇంటర్నేషనల్ స్కూల్, ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రి వెనుక భాగంలో పూజా కిడ్స్ స్కూళ్లను కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు.
రాజారెడ్డి సోదరుడు శ్రీధర్‌రెడ్డితోపాటు అతని భార్య ప్రసన్నలక్ష్మిలు పూజా స్కూల్‌లోనే ఉంటూ నిర్వహణా బాధ్యతలు చూస్తున్నారు. శనివారం, ఆదివారం పాఠశాలకు సెలవులు రావడంతో పూజా స్కూల్‌లోని విద్యార్థులను ఇళ్లకు పంపించారు. దీంతో పూజా స్కూల్లో దూరప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు, పని మనిషులు మాత్రమే ఉన్నారు.
రాత్రి శబ్ధం రావడంతో..
శుక్రవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో స్కూల్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో పై అంతస్తులో ఉన్న ప్రిన్సిపాల్ జాన్ హుటాహుటిన కిందికి వచ్చాడు. శ్రీధర్‌రెడ్డి గాబరా పడుతూ కనిపించడంతో.. తిరిగి ఆయన పైకెళ్లి తొందరగా కిందికి రావాలని తోటి ఉపాధ్యాయులను పిలిచాడు. దీంతో ఉపాధ్యాయులతోపాటు పీఈటీ రామాంజనీ కిందికి వచ్చారు.
వారు వచ్చేసరికి కింద పడిపోయిన రాజారెడ్డికి శ్రీధర్‌రెడ్డి, అతని భార్య లక్ష్మీప్రసన్న, కుమార్తెలు సపర్యలు చేస్తున్నారు. కొద్ది సేపటి తర్వాత రాజారెడ్డిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు చెప్పారు. విషయం తెలియడంతో సీఐ ఇబ్రహీంతోపాటు రూరల్ ఎస్‌ఐలు చిరంజీవి, శివప్రసాద్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాజారెడ్డి మృతదేహంపై ఎక్కువ గాయాలు ఉండటం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. వీపు, ముఖం, చేతులకు గాయాలున్నాయి. దీంతో ఆయన మృతిపై బంధువులు, పూజా స్కూల్ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అనుమానాలను పెంచిన రీ పోస్టుమార్టం
పూజా స్కూల్ పీఈటీ రామాంజనీ ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం రాజారెడ్డి మృతదేహానికి జిల్లా ఆస్పత్రిలోని డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పూజా స్కూల్‌కు తరలించారు. విద్యార్థులు, బంధువుల సందర్శనార్థం కొంత సేపు అక్కడ ఉంచి తర్వాత మైలవరంలోని డాడీ హోంకు మృతదేహాన్ని తరలించాలని భావించారు.
అక్కడే ఉన్న పోలీసు అధికారులకు అనుమానం రావడంతో మరింత లోతుగా రీ పోస్టుమార్టం నిర్వహించాలని డీఎంహెచ్‌ఓను కోరారు. రీ పోస్టుమార్టం నిర్వహించేందుకు కడప నుంచి ప్రొఫెసర్ల బృందాన్ని పంపించనున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. దీంతో పూజా స్కూల్‌లో ఉన్న రాజారెడ్డి మృతదేహాన్ని తిరిగి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రొఫెసర్లచే రీ పోస్టుమార్టం చేయించారు.
పోస్టుంమార్టం తర్వాత రాజారెడ్డి మృతిపై పోలీసులకు అనుమానాలు మరింతగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం మైలవరంలోని డాడీ హోంలో రాజారెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. రాజారెడ్డి మృతితో డాడీహోంలోని అనాథ పిల్లలు బోరున విలపించసాగారు. రాజారెడ్డి తల్లి సుబ్బమ్మ కుమారుని మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించింది.
పోలీసు అధికారుల దర్యాప్తు
ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణాకుమార్, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు జిల్లా ఆస్పత్రికి చేరుకొని స్కూల్ నిర్వాహకులతో మాట్లాడారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులతో కూడా పోలీసు అధికారులు చర్చించారు. కాగా ఇటీవల పూజాస్కూల్ నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి బాధ్యతలను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగిన ఇరువురు అనాథ బాలికలకు అప్పగించినట్లు తెలిసింది. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రముఖుల నివాళులు
రాజారెడ్డి మృతదేహాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పూజాస్కూల్‌లో ఉన్న రాజారెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సేవకు మారుపేరుగా నిలిచిన రాజారెడ్డి మరణం తనను ఎంతగానో కలచి వేసిందని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, ఏఎస్పీ లోసారి సుధాకర్‌తోపాటు రాజుపాళెం మండలంలోని రాజారెడ్డి బంధువులు, సన్నిహితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూజా స్కూల్లో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు రాజారెడ్డిని కడసారి చూడటానికి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment