
తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు నమస్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే శంకర్
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ అధిష్టానం పార్టీ అభ్యర్థిత్వాన్ని ఇంకా ఖరారు చేయకముందే ఎవరికి వారు టికెట్ మాదంటే మాదే అంటూ పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి.. మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్ వర్గీయులు, ఇటీవల టీడీపీలో చేరిన ఓ నేత వర్గీయులు పార్టీ టికెట్ తమనేతలకే చంద్రబాబు ఖరారు చేశారంటూ టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
ములకలచెరువు మండలానికి చెందిన ఓ నేత చంద్రబాబును కలిసిన ఫొటోలతో, అభ్యర్థిత్వం మా నేతకే ఖరారు చేశారని, రెండురోజుల్లో ప్రకటిస్తారని చెబుతూ సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకున్నారు. దీనిపై గురువారం రాత్రి బి.కొత్తకోటలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులు చంద్రబాబు టికెట్ ఖరారు చేశారంటూ బస్టాండ్‌లో నినాదాలు చేశారు. చంద్రబాబు టికెట్ ఎవరికి ఖరారు చేశారంటూ చర్చ మొదలవగా శంకర్ వర్గీయుల్లో ఆగ్రహం వ్యక్తమైంది.
హడావుడిగా సమావేశం
ఇటీవల పార్టీలో చేరిన నేత టికెట్ తనకే అన్న ప్రచారంతో మాజీ ఎమ్మెల్యే శంకర్ శుక్రవారం మదనపల్లెలోని తన కార్యాలయంలో హడావుడిగా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ మొత్తం తనవెంటే ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఆరు మండలాలకు చెందిన పార్టీ కన్వీనర్లు, జిల్లా, రాష్ట్ర పార్టీ పదవులున్న నేతలు, నామినేటేడ్ మాజీ ప్రతినిధులు, పార్టీ శ్రేణులతో జరిపిన సమావేశంలో మాట్లాడిన ఆయన..ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ తనకే ఇస్తారని చెప్పుకున్నారు.
ఈ విషయమై శంకర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. టికెట్ ఎవరికి అన్నది ఇంకా ఖరారు చేయలేదని చెప్పినట్లు శంకర్ వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డామని, తనకే న్యాయం జరుగుతుందని శంకర్ పార్టీ శ్రేణులతో చెప్పుకున్నారు. ఈ మీటింగ్ అయిపోయాక టికెట్ తనకే ఖరారు చేశారని ఓ నేత తన వర్గీయులతో కురబలకోట నుంచి ములకలచెరువు వరకు శుక్రవారం కార్లతో ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. శంకర్‌ను వ్యతిరేకించే కొందరు కార్యకర్తలు ఈ ర్యాలీలో కనిపించారు.
పార్టీ బలం తగ్గుతోందనే వ్యూహం
తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలం రోజురోజుకు తగ్గిపోతోంది. 2019 తర్వాత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులు చరిత్రలో లిఖితమయ్యే స్థాయిలో జరిగాయి. వచ్చే 30 ఏళ్లకు జరగాల్సిన అభివృద్ది ఐదేళ్లలోనే జరిగింది. దీంతో టీడీపీపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ 26,938 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. అప్పటినుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు టీడీపీ బలం తగ్గడమే కానీ పుంజుకుంది లేదు. 2022 వరకు నియోజకవర్గ నేతల ఉనికి కూడా కనిపించలేదు. వైఎస్సార్‌సీపీ పోటీని తట్టుకునే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు టికెట్ కావాలని తనను ఎవరు కలిసినా మీకే టికెట్ అంటూ ప్రోత్సహించడం ద్వారా పార్టీకి క్రేజ్ తీసుకురావాలని వ్యూహం పన్నినట్టు పలువురు చర్చించుకుంటున్నారు.
ఈ మధ్య మరోనేత కూడా టీడీపీ లేదా జనసేన అభ్యర్థిత్వతం ఆశిస్తూ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఇలాంటి కార్యక్రమాలతో పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఎవరు టీడీపీలో చేరినా టికెట్ మీకే అని ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఏడాదిలో టీడీపీలో చేరిన ఓ నాయకుడిని పార్టీలో చేర్చుకోవద్దంటూ నియోజకవర్గ నేతలు చంద్రబాబు చెప్పినా వినలేదు. చంద్రబాబు వ్యూహంలో ఎవరు బలిపశువులు అవుతారో అని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.
నమ్ముకుంటే ముంచేస్తారా
మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌కు టికెట్ దక్కుతుందా లేదా అన్న చర్చ జరుగుతున్న నేపథంలో తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్లను ముంచేస్తారని శంకర్ వర్గీయులు విమర్శిస్తున్నారు. అభ్యర్థిత్వాన్ని ఇంకా ఖరారు చేయకపోయినా కొత్తగా వచ్చిన నాయకులు తమకే టికెట్ ప్రకటించారని ఎలా ప్రచారం చేసుకుంటారని శంకర్ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న వారిని ముంచేఽయడమే చంద్రబాబు నైజమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త నేత కార్ల ర్యాలీ నిర్వహించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపై నియోజకవర్గ రాజకీయాలు క్రీయాశీలం అవుతామని స్పష్టం చేస్తున్నారు.