రాయచోటిలో ఉద్రిక్తత
రాయచోటి: రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి పారువేట ఊరేగింపులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల నుంచి సామరస్య పరిస్థితులు నెలకొనక పోవడంతో ఒక దశలో పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఆలయం నుంచి స్వామి వారి ఊరేగింపు ఠాణా మీదుగా రవి థియేటర్ సమీపంలోని పారువేట ప్రాంతానికి చేరుకుంది. ఊరేగింపులో భాగంగా కంసల వీధి నుంచి ఠాణా సర్కిల్‌లోని పెద్ద మసీదు వద్దకు చేరుకోగానే.. మరో వర్గం రోడ్డుపైకి రావడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాలలోని చిల్లర మూకల కారణంగా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో.. రెండో మారు ఎస్పీ సమక్షంలోనే పోలీసులు లాఠీచార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టాల్సి వచ్చింది. పరిస్థితులను అదుపు చేసేందుకు పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం పారువేట కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించారు.
ఇరువర్గాలకు హెచ్చరిక: ఎస్పీ
శాంతి భద్రతలకు ఏ మాత్రం విఘాతం కలిగించినా, అసాంఘిక శక్తులు బయటికి వచ్చినా తాట తీసి, కేసులు పెట్టి అంతు చూస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. వర్గాలను ఎవరు రెచ్చగొట్టినా చర్యలు కఠినంగా ఉంటాయని ఆయన తీవ్రంగా స్పందించారు. అదే స్థాయిలో స్థానిక పోలీస్ అధికారులు కూడా అప్రమత్తం కాకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని పట్టణ పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు
భారీగా బందోబస్తు ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment