బాలల సంరక్షణ కేంద్రాల రిజిస్ట్రేషన్‌కు మరో అవకాశం
రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లాలోని బాలల సంరక్షణ కేంద్రాల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం మరో అవకాశం కల్పించినట్లు జిల్లా స్థాయి నోడల్ అధికారి, అదనపు జిల్లా పర్యవేక్షణాధికారి కె.రవిప్రకాష్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.జిల్లాలో బాలల న్యాయ చట్టం ప్రకారం పిల్లల రక్షణ, సంరక్షణ కోసం నడుపుతూఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ చేసుకోని సంస్థలు ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.మార్చి 10వ తేదీ తర్వాత కూడా రిజిస్ట్రేషన్ పొందకుండా బాలల సంరక్షణ కేంద్రాలు నడిపితే అటువంటి వ్యక్తులు, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇంటర్ పరీక్షలకు
989 మంది గైర్హాజరు
రాయచోటి : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష గురువారం జిల్లా వ్యాప్తంగా 49 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. 16278 మంది విద్యార్థులకు 15289 మంది హాజరయ్యారు. 989 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ కృష్ణయ్య తెలిపారు. రెగ్యులర్ పరీక్షల్లో 15018 మందికి 14203 మంది పరీక్షలకు హాజరు కాగా, ఒకేషనల్ పరీక్షలకు 1260 మంది విద్యార్థులకు 1086 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో లోటుపా ట్లు లేకుండా విద్యార్థులకు తగిన మౌలిక వసతులను కూడా కల్పించామని ఆయన తెలిపారు.
ప్రభుత్వ భూములను
కాపాడటమే లక్ష్యం
పీలేరు : ప్రభుత్వ భూములు కాపాడటమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. గురువారం పీలేరు తహసీల్దార్ కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. పీజీఆర్‌ఎస్, రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలపై గ్రామాల వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన వాటికి నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపాలని అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌లో ఇంకా 80, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల్లో 56 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వారం లోగా వీటిని పరిష్కరించాలని ఆదేశించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. పీలేరు మండలంలో పలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్లు గుర్తించామని, వాటిని స్వాధీనం చేసుకుంటామని, ఆక్రమించుకున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్రమణలపై ఎవరి ఒత్తిడికి లోను కాకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి, తహసీల్దార్ భీమేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ లోక్‌అదాలత్
విజయవంతం చేద్దాం
మదనపల్లె : ఉమ్మడి చిత్తూరుజిల్లాలో ఈనెల 8వతేదీ శనివారం జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో కక్షిదారులు పాల్గొని కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.ఎస్.భారతి పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి ఎం.ఎస్.భారతి మాట్లాడుతూ... కేంద్ర న్యాయసేవ అధికార సంస్థ, రాష్ట్ర న్యాయ అధికార సేవాసంస్థ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చిత్తూరుజిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావ్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉమ్మడి చిత్తూరుజిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్‌అదాలత్ జరుగుతుందన్నారు. ఉమ్మడి చిత్తూరుజిల్లాలో 32 బెంచ్‌లు ఏర్పాటుచేశామన్నారు. 1997 నుంచి జాతీయ లోక్‌అదాలత్ ద్వారా కేసులను రాజీచేయనున్నట్లు చెప్పారు. కోర్టుల్లో లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రతి మూడునెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా సుమారు 10 నుంచి 20శాతం కేసులు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవడం వల్ల కక్షదారులకు సమయంతో పాటుగా ధనం ఆదా అవుతుందన్నారు. లోక్‌అదాలత్‌లో ఇచ్చిన తీర్పు అంతిమమని, దానిపై అప్పీల్ ఉండదన్నారు. శనివారం నిర్వహించే లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు, న్యాయవాదులు, రెవెన్యూ, పోలీస్, బ్యాంక్ అధికారులు, చిట్‌ఫండ్ కంపెనీలు, బీమా సంస్థల ప్రతినిధులు, కక్షిదారులు పాల్గొనాలని, ఎక్కువ కేసులు పరిష్కరించి చిత్తూరు జిల్లాను రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంచేందుకు సహకరించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment