రూటే.. సప‘రేటు’..!
ఏ పనైనా సరే చేయాలంటే అందుకు నిబంధనలు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలిచ్చారు. ‘పరిపాలనకు’ పాతర వేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ‘అవినీతి జాడ్యం’ పట్టుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి టాస్స్‌ఫోర్స్ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శాఖలో తవ్వే కొద్దీ అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయి. ఇటీవల కాలంలో అవకతవకలపై విచారణలు జరుగుతున్నాయి. తాజాగా మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శాఖలో పరిపాలన అదుపు తప్పిందనే వాదన ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు..
‘బ్యాన్’ ఉన్న వేళ బదిలీ
ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ‘బ్యాన్’ విధించింది. అంటే బ్యాన్‌ను తొలగించే వరకు ఎలాంటి బదిలీలు చేపట్టకూడదు. అయితే ఈ శాఖలో నిబంధనలు ధిక్కరించి బదిలీ చేయడం గమనార్హం. ఉమ్మడి జిల్లాకు సంబంధించి పుల్లంపేట పీహెచ్‌సీలో పని చేస్తున్న ఒక ఉద్యోగి ఆరు నెలలు మెడికల్ లీవ్ పెట్టారు. మెడికల్ లీవ్ అనంతరం ఆ ఉద్యోగికి రీపోస్టింగ్ ఇవ్వాలి. ప్రస్తుత జీఓ ప్రకారం తిరిగి పుల్లంపేటకే పోస్టింగ్ ఇవ్వాలి. అయితే అందుకు విరుద్ధంగా మాధవరం పీహెచ్‌సీకి పోస్టింగ్ ఇచ్చారు. అంటే ఆ ఉద్యోగిని పుల్లంపేట నుంచి మాధవరానికి బదిలీ చేశారు. ‘బ్యాన్’ ఉన్న సమయంలో ఈ బదిలీని ఏ ప్రాతిపదికన చేపట్టారో.. ఆ శాఖ వారికే ఎరుక. ఇందుకు గాను ఆ ఉద్యోగి నుంచి రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు లంచం తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఆ ఉద్యోగి ఆరు నెలల మెడికల్ బిల్లు రూ.1,75,000 మంజూరు చేయడానికి మరో రూ.20 వేలు వసూలు చేసినట్లు తెలిసింది.
ఉద్యోగులు సతమతం
అలాగే సొంత శాఖలో జిల్లా వ్యాప్తంగా పని చేసే సిబ్బందిని కూడా వదలడం లేదు. డ్రాయింగ్ అండ్ డిస్‌పర్సమెంట్ పరిధి కారణంగా 90 పీహెచ్‌సీలు వస్తాయి. మెడికల్ ఆఫీసర్ మొదలుకొని క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు సర్వీసుకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇక్కడ కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మెడికల్ లీవ్‌కు రూ 5.వేలు, ఎర్న్ లీవుకు రూ.3 వేలు, ఇంక్రిమెంట్ మంజూరుకు డాక్టర్‌కు అయితే రూ.3 వేలు, ఫీల్డ్ స్థాయి సిబ్బందికి రూ.2 వేలు, ఏదైనా దరఖాస్తును డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు ఫార్వర్డ్ చేయాలంటే రూ.5 వేలు, గర్భిణుల మెడికల్ బిల్లుకు రూ.5 వేలకు పైగా ఇలా ప్రతి పనికి ఒక రేటును ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారు. ఇందుకు కొంత మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ శాఖలో వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు. ఏవైనా కార్యాలయ పనులు పడినప్పుడు అడిగినంత ఇచ్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. లేదంటే ఫైళ్లు ముందుకు కదలవు.. పనులు జరగవు. దీంతో ఈ శాఖలో పూర్తి స్థాయిలో ‘పరిపాలన’కు పాతర పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు ఉద్యోగ భద్రతా కారణాల వల్ల తమ సమస్యలను బహిర్గతంగా చెప్పుకోలేరు. కారణాలు ఏవైనప్పటికీ సమగ్ర విచారణ చేపట్టి ప్రభుత్వ నిబంధనలు అమలయ్యేలా చూడాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
వైద్య ఆరోగ్య శాఖలో ‘కాసుల వేట’
ప్రతి పనికీ ఓ లెక్క
నిబంధనలకు విరుద్ధంగా బదిలీ
Comments
Please login to add a commentAdd a comment