రంజాన్ వేళ.. రూపుదిద్దుకుంది ఇలా..!
రాజంపేట టౌన్ : ముస్లింలు రంజాన్ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలో ముస్లింలు నియమ, నిష్టలతో ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం చేపట్టే, విరమించే సమయాన్ని విధిగా పాటిస్తారు. ఎందుకంటే సహర్, ఇఫ్తార్‌ల సమయం కంటే ముందుగాని, ఆలస్యంగా గాని ఉపవాసం చేపట్టడం, విరమించడం చేస్తే ఆ రోజు చేపట్టే ఉపవాస దీక్షకు సార్థకత ఉండదని ముస్లిం మతపెద్దలు చెబుతున్నారు. అందువల్ల సహర్, ఇఫ్తార్‌లు సరైన సమయంలోనే పూర్తి చేయాలి.
పూర్వం ఎలా చేసేవారంటే...
ప్రస్తుతం సహర్, ఇఫ్తార్‌లు ఏ సమయంలో చేపట్టాలో తెలియజేసేందుకు కాలపట్టిక అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కాలపట్టిక అందుబాటులోకి రాని సమయంలో సహర్, ఇఫ్తార్ వేళలను తెలియజేసేందుకు తూటాలు పేల్చేవారు. టపాసులు అందుబాటులోకి వచ్చాక టపాసులను పేల్చి తెలియజేసేవారు. కాలక్రమంలో మైకులు అందుబాటులోకి వచ్చాక మసీదుల్లో మౌజన్‌లు ఉపవాసం ప్రారంభానికి ఓ అరగంట ముందు రోజేదారో ఉఠో..ఉఠో (ఉపవాసం ఉండేవారు లేవండి) అంటూ నిద్రలేపేవారు. ఇక ఇఫ్తార్ సమయాన్ని అదే సమయంలో తెలియజేసేవారు. ప్రస్తుతం కాలం పూర్తిగా మారిపోయినందున సహర్, ఇఫ్తార్ వేళలను కార్డుల్లో ముద్రిస్తున్నారు. ఈ కార్డులను వ్యాపార సంస్థలు, ఆర్థిక పరిపుష్టి కలిగిన ముస్లింలు ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
సమయ నిర్ధారణ పట్టిక ఎలా తయారైందంటే..
పూర్వం ముస్లింలు ఉపవాసం ప్రారంభం, విరమణ సమయాల విషయంలో ఇబ్బందులు పడేవారు. ఈ ఇబ్బందులను గమనించిన ముఫ్తీ మహమ్మద్ రహీముద్దీన్ అబ్దుల్‌వాసే ఉపవాస ప్రారంభ, విరమణ సమయ నిర్ధారణ పట్టిక తయారు చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా కొన్ని రోజులు శ్రమించి ముస్లింలు దీక్ష చేపట్టే సమయ పట్టికను 290 పేజీల పస్తకం ‘మియారుల్ ఔకాత్’లో పొందుపరిచారు. ఇప్పటికీ ఈ పుస్తకం ఆధారంగానే ఉపవాస సమయ పట్టికను నిర్ధారిస్తున్నారు. ఈ పుస్తకం ఆధారంగా 1968వ సంవత్సరంలో తొలిసారిగా ఉపవాస సమయ పట్టికను తయారు చేశారు. ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి వచ్చే సరికి సహర్, ఇఫ్తార్ వేళల్లో కొన్ని నిమిషాల తేడాతో సమయ పట్టిక రూపొందించారు. అందువల్ల ఒక పట్టణానికి, మరొక పట్టణానికి రెండు లేక మూడు నిమిషాల తేడాతో సహర్, ఇఫ్తార్‌లు ప్రారంభమవుతాయి. ఈ సమయ పట్టికకు ఉపవాస సమయ పట్టిక అని నామకరణం చేశారు. ఉపవాస సమయ పట్టిక తయారై దాదాపు 56 సంవత్సరాలకు పైగా అయింది.
చిన్నపాటి కార్డులో
సహర్, ఇఫ్తార్ వేళలు తెలియజేసే పట్టిక
ఇతరులను అడగాల్సిన అవసరం ఉండదు..
ఖచ్చితమైన సమయంలోనే సహర్, ఇఫ్తార్‌లు పూర్తి చేయాలి. అందువల్ల నా చిన్నవయస్సులో ఒకరోజు ముందు సహర్, ఇఫ్తార్ వేళలు చెప్పేవారు. మసీదుకు వెళ్లని వారు ఇతరులను అడిగి తెలుసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత కొన్నేళ్లుగా సహర్, ఇఫ్తార్ వేళలు తెలియజేసే పట్టికను కార్డుల్లో ముద్రించి ఇస్తున్నారు. అందువల్ల చాలా సౌకర్యవంతంగా ఉంది.
– అబ్దుల్ మునాఫ్, ఉస్మాన్ నగర్, రాజంపేట
రంజాన్ వేళ.. రూపుదిద్దుకుంది ఇలా..!
Comments
Please login to add a commentAdd a comment