● సేవా పథంలో పయనం
కడప నగరానికి చెందిన నెమలిదిన్నె నాగవేణి పరిచయం అవసరం లేని సామాజిక సేవా కార్యకర్తగా గుర్తింపు సాధించుకున్నారు. నిజానికి ఆమె నిరుపేద కుటుంబానికి చెందిన యువతి. అయినా నగర పరిధిలోని అనాథ, వృద్ధులు, మహిళల ఆశ్రమాల్లో దుప్పట్లు, నూతన వస్త్రాలు, అన్నదానాలు చేస్తూ వారి అభిమానాన్ని సాధించుకున్నారు. రక్త సేకరణ శిబిరాలు, గుండె సంబంధిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారు. దీపావళికి జువైనల్ హోంలోని బాలలందరికీ నూతన వస్త్రాలు, విందు భోజనం అందిస్తారు. వారితో కలిసి టపాసులు కాల్చి ఆనందిస్తారు. అధికారుల చుట్టూ తిరుగుతూ సేవా కార్యక్రమాల్లో వారు కూడా భాగస్వాములు అయ్యేలా చూస్తారు. ప్రైవేటుగా పీజీ చేస్తున్న ఆమె ప్రస్తుతం కడప నగరంలో పర్యాటక శాఖలో చిరుద్యోగిగా సేవలు అందిస్తున్నారు. ఇంతవరకు ఒక్క అన్నం పొట్లం కూడా ఇంటికి తీసుకెళ్లని ఆమెను విశ్వసించిన పలువురు మానవతా వాదులైన దాతలు ఆమె ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తనపై ఉన్న నమ్మకాన్ని చిరకాలం నిలబెట్టుకునేందుకే ప్రయత్నిస్తానని, తనను చూసిన వెంటనే ఆర్తుల ముఖాల్లో కనిపించే వెలుగును చూస్తే తన హృదయం ఆనందంతో నిండిపోతుందనంటారు నాగవేణి. అందుకు ఆమెను జిల్లా స్థాయి అధికారులు సైతం అభిమానిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment