నేడు పాఠశాలలకు సెలవు
రాయచోటి టౌన్: మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండో శనివారం అయినా పాఠశాలల పనిదినాలు తక్కువగా ఉండటం వల్ల తరగతులు నిర్వహించాలని నిర్ణయించామని, అయితే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఉన్నతాధికారులు ఈ నెల 8 వతేదీ సెలవుగా ప్రకటించారని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు ఈ విషయాన్ని గ్రహించాలని కోరారు.
12న వేలం పాట
కురబలకోట: జిల్లాలో ప్రతిష్టాత్మకమైన మండలంలోని అంగళ్లు టమాటా మార్కెట్, గొర్రెల సంతతో పాటు కూరగాయల సంత గేటు వేలం పాటలు ఈనెల 12న ఉదయం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతాయి. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ పోరెడ్డి విశ్వారెడ్డి, గ్రామ కార్యదర్సి టి. ఉదయ్‌కుమార్ తెలిపారు. టమాటా మార్కెట్, గొర్రెల సంత గేటు వేలం పాటల్లో పాల్గొనదలచిన వారు ముందుగా రూ.5 లక్షల చొప్పున ఽడిపాజిట్టు చెల్లించాలన్నారు.
నూతన నియామకం
మదనపల్లె సిటీ: జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం సమన్వయకర్తగా మదనపల్లెకు చెందిన పేస్ స్వచ్చంద సంస్థ డైరెక్టర్ వి.ఎస్.రెడ్డిని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి నియమించారు. వీ.ఎస్.రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని వినియోగదారులను చైతన్యపరిచి సంఘటితం చేయడానికి కృషి చేస్తానన్నారు. ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలు చేస్తామన్నారు. త్వరలోనే మండల వినియోగదారుల సమాచార కేంద్రాలను అధికారుల సహకారంతో నియమించడానికి కృషి చేస్తానన్నారు.
నేడు, రేపు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సేవలు
మదనపల్లె: ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా రెవెన్యూ సంపదలో భాగంగా శని, ఆది సెలవురోజుల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...రిజిస్ట్రేషన్స్ ఐజీ, డీఐజీ, డీఆర్ ఉత్తర్వుల మేరకు శని, ఆదివారాల్లో హాలిడే రిజిస్ట్రేషన్స్ చేయాలని ఉత్తర్వులు అందాయన్నారు. జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు శని, ఆది రెండురోజులు అందుబాటులో ఉంటాయని, ప్రజలు రిజిస్ట్రేషన్ సేవలను వినియోగించుకోవాలన్నారు. అయితే ఇందుకోసం అదనంగా రూ.5,000 హాలిడే రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
రాయచోటి పరిపాలన కేంద్రంగా జిల్లా కొనసాగుతుంది
రాయచోటి టౌన్: రాయచోటి పరిపాలన కేంద్రంగా అన్నమయ్య జిల్లా కొనసాగుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శాసన మండలిలో ఎమ్మెల్సీ రాంభూపాల్‌రెడ్డి జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ఏమైనా ఉందా.. ఉంటే ఎలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి.. ప్రక్రియను ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే ప్రశ్నలకు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారని చెప్పారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన లు ఏమీ లేవని పేర్కొన్నారని తెలిపారు. కాబట్టి రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుందని, అందులో ఎలాంటి మార్పులు ఉండవని, వీటిపై వస్తున్న వదంతులు నమ్మొద్దని స్పష్టం చేశారు.
మెగా డీఎస్సీకి ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ
రాయచోటి జగదాంబసెంటర్: మెగా డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారి సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ పొందేందుకు బీసీ, ఈబీసీ కేటగిరీలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈ నెల 10 నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు. టెట్ అర్హత సాధించిన అభ్యర్థులు సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన వారు రాయచోటిలోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయం( గిరిజన బాలుర పాఠశాల వెనుక, రాజంపేట రోడ్డు)లో దరఖాస్తులు పొంది అక్కడే సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు రాయచోటిలోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment