– రూ.12లక్షలు స్వాహా చేసిన సంఘం లీడర్
మదనపల్లె : డ్వాక్రా సంఘానికి లీడర్‌గా వ్యవహరిస్తూ గ్రూప్‌కు సంబంధించిన నిధులు రూ.12లక్షలు స్వాహా చేసిందని గ్రూప్ సభ్యులు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పట్టణంలోని ఈశ్వరమ్మకాలనీలో రాజరాజేశ్వరి డ్వాక్రా సంఘం ఉంది. అందులో 10మంది సభ్యులు ఉండగా, గ్రూప్‌లీడర్‌గా కే.రాధ వ్యవహరించేది. ఈ క్రమంలో సభ్యులు గ్రూప్‌కు సంబంధించిన డబ్బులు చెల్లించగా, వాటిని స్వప్రయోజనాలకు వాడుకుంది. మరో గ్రూపు సభ్యురాలు లక్ష్మీదేవి వద్ద ఉంచిన రూ.1లక్ష20వేలుతో కలిపి మొత్తంగా రూ.12లక్షలు స్వాహా చేసి ఉడాయించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంఘమిత్ర వాణి పూర్తి సహాయసహకారాలు అందించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందుకున్న తాలూకా సీఐ కళావెంకటరమణ స్థానికంగా విచారించి కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఫిర్యాదుచేసిన వారిలో గ్రూపు సభ్యులు పద్మ, నిర్మల, లలిత, లక్ష్మీదేవి, చంద్రకళ, రెడ్డిరాణి ఉన్నారు.
వేడినీళ్లు పడి చిన్నారికి గాయాలు
మదనపల్లె : వేడినీళ్లు మీద పడి చిన్నారి గాయపడిన సంఘటన కురబలకోట మండలంలో శుక్రవారం జరిగింది. సర్కార్‌తోపునకు చెందిన అస్రా అంజుమ్(3) ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడినీళ్లు మీద పడవేసుకుంది. నీటివేడికి చిన్నారి తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.
విద్యాప్రమాణాల పెంపునకు కృషిచేయాలి
– ఉన్నతవిద్యామండలి అకడమిక్ ఆఫీసర్ శ్రీరంగం మాథ్యూ
మదనపల్లె : రాష్ట్రంలోని అటానమస్ డిగ్రీ కళాశాలల్లో విద్యాప్రమాణాల పెంపుకు కృషి చేయాలని విజయవాడ ఉన్నత విద్యామండలి అకడమిక్ ఆఫీసర్ శ్రీరంగం మాథ్యూ అన్నారు. పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో జరుగుతున్న రెండురోజుల వర్క్‌షాప్‌కు శుక్రవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశంలో లివరేజింగ్ అటానమీ, బోర్డ్ ఆఫ్ స్టడీస్, అకడమిక్ కౌన్సిల్, గవర్నింగ్ బాడీ, ఫైనాన్స్ కమిటీల గురించి తెలియజేశారు. అటానమస్ కళాశాలకు ఇండస్ట్రీకి అనుగుణంగా సిలబస్‌ను మార్చుకునే వెసలుబాటు ఉందన్నారు. స్టాండర్స్‌ను ఎంచుకోవాలన్నారు. ఇది విద్యార్థికి ఎంతవరకు ఉపయోగపడుతుందనే అంశంపై శ్రద్ధ పెట్టాలన్నారు. స్కిల్ ఓరియంటెడ్ కోర్సులను పెట్టాలన్నారు. టీచింగ్ మెథడాలజీ, ఎవాల్యుయేషన్‌పై తెలియజేశారు. విద్యార్థికి పరీక్షలు జరిగిన తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫలితాలను ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డాక్టర్.రాటకొండ గురుప్రసాద్, ప్రిన్సిపాల్ సురభి రమాదేవి, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment