
వేటగాళ్ల ఉచ్చుకు వ్యవసాయకూలీ బలి
గుర్రంకొండ : వేటగాళ్ల ఉచ్చుకు వ్యవసాయకూలీ బలైన సంఘటన మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ దిగువ కమ్మపల్లెలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పి. రమేష్‌నాయుడు(48) వ్యవసాయ కూలి పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి పనిమీద బయటకు వెళ్లాడు. అయితే రాత్రిళ్లు ఇంటికి రాకపోయేసరికి శనివారం కుటుంబ సభ్యులు గ్రామానికి పక్కనే ఉన్న కొండలు, గుట్టల్లో గాలించారు. చివరగా వ్యవసాయ పొలాల వద్ద గాలిస్తుండగా ఎగువకమ్మపల్లె–కిలారివాండ్లపల్లె గ్రామాలకు మధ్యలో ఉన్న వ్యవసాయ పొలాల్లో విగతజీవుడుగా పడి ఉండటం గమనించారు. చేతులు, కాళ్లు మొత్తం కోసుకుపోయి విద్యుదాఘాతానికి గురైనట్లు ఆనవాళ్లు కనిపించాయి. దీనిపై ఆరా తీయగా అక్కడి సమీప పొలాల్లోనే కొంతమంది వేటగాళ్లు అడవి జంతువులను వేటాడడం కోసం విద్యుత్ తీగెలతో ఉచ్చులు పన్నుతున్నారని అక్కడి రైతులు పేర్కొన్నారు. దీంతో అడవి జంతువులకు కోసం పన్నిన విద్యుత్ తీగల్లో చిక్కుకొని రమేష్‌నాయుడు మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వాల్మీకిపురం సీఐ ప్రసాద్, ఎస్‌ఐ మధురామచంద్రుడు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment