ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
వలస వచ్చినా ఇల్లు ఇచ్చారు
13 సంవత్సరాల క్రితం మా మేన మామ తాతారావుతో నా వివాహం జరిగింది. ఆ తర్వాత బతుకుతెరువు కోసం అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ గ్రామానికి వచ్చాం. మా స్వగ్రామం కృష్ణా జిల్లా మచిలీపట్నం. నా భర్త కేటరింగ్‌తో పాటు వంట మాస్టర్‌గా పని చేస్తారు. నేను నా భర్తకు ఇంటి దగ్గర కేటరింగ్‌కు అవసరమైన సహాయం చేస్తూ ఇంటి పనులు చూసుకుంటాను. ఈ ప్రాంతంలో సొంతిల్లు లేకపోవడంతో ఇద్దరు పిల్లలతో ఇరువాడ బీసీ కాలనీలో అద్దెకు ఉండేవాళ్లం.
వచ్చే రూ.9, 10 వేల ఆదాయంలో అద్దెకే రూ.3 వేలు ఇవ్వాల్సి వచ్చేది. మిగిలిన సొమ్ముతో కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో జగనన్న కాలనీలో ఇంటి స్థలానికి దరఖాస్తు చేసుకున్నాం. సబ్బవరం సమీపంలో జాతీయ రహదారిని ఆనుకొని ప్రభుత్వం స్థలం ఇచ్చింది. ఇల్లు కట్టుకోవడానికి రూ.1.80 లక్షలు ఇచ్చారు. మేము మరికొంత డబ్బు వెచ్చించి ఇల్లు నిర్మించుకున్నాం.
మా కల నెరవేరింది. సొంతింట్లో పిల్లలతో కలిసి ఆనందంగా ఉంటున్నాం. మాకు జగనన్న ఇచ్చిన స్థలమే బహిరంగ మార్కెట్లో రూ.6 లక్షలకు పైగా పలుకుతుంది. మాకు ఇద్దరు పిల్లలు. బాబు వినయ్‌నాయుడు సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. నాలుగేళ్లుగా అమ్మఒడి ఏటా రూ.15,000 వంతున వస్తోంది. పాప జాహ్నవి అదే పాఠశాలలో 4వ తరగతి. మా సొంతింటి కలను నెరవేర్చిన జగనన్నకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. – పల్లి జానకీదేవీ, ఇరువాడ (సుర్ల నాగేశ్వరరావు, విలేకరి సబ్బవరం)
ప్రాణాపాయంలో కొండంత అండ
అర్చకత్వం నా వృత్తి. శ్రీకాకుళం జిల్లా మందస మండలం మూలిపాడు పంచాయతీ శ్రీనివాసపురంలోని శ్రీబాలాజీ రఘునాథస్వామి ఆలయ పూజారిగా పని చేస్తున్నా. దానిపై వచ్చే ఆదాయంతోనే జీవిస్తున్నా. నాకు భార్య, ఇద్దరు మగ పిల్లలు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారులు ఇద్దరూ విశాఖపట్నంలో ప్రైవేటు దుకాణాల్లో పని చేస్తున్నారు. కుమార్తెకు వివాహం చేసి అత్తారింటికి పంపించాం.
ఏదోలా కాలం గడుపుతున్న నాకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది.ఆస్పత్రిలో చూపిస్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు. పెద్ద మొత్తంతో ఖర్చవుతుందని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని గ్రామ పెద్దలు చెప్పడంతో శ్రీకాకుళంలోని జెమ్స్ ఆస్పత్రికి వెళ్లాము. అక్కడ ఒక్క నయా పైసా ఖర్చు లేకుండా శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను.
నా భార్య పంకజ డ్వాక్రా మహిళా సంఘం సభ్యురాలు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద ఏటా రూ.15,000 వంతున మూడేళ్లుగా అందింది. గతంలో తీసుకున్న డ్వాక్రా రుణానికి సంబందించి వైఎస్సార్ ఆసరా కింద ఇప్పటి వరకు రూ.18,600 ఆమె ఖాతాలో జమయ్యాయి. మేము హాయిగా జీవిస్తున్నాం. – రమేష్ మహంతి, శ్రీనివాసపురం (కొంచాటి ఆనందరావు, విలేకరి, మందస)
అమ్మనాన్నలకు భారం కాకుండా చదువు
మాది నిరుపేద గిరిజన కుటుంబం. మా నాన్న ఆరిక భాస్కరరావు, అమ్మ కుసుమ పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం సంతోషపురం గ్రామంలోని కొండపై పోడు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నా చదువు వారికి పెద్ద భారంగా మారింది. ప్రభుత్వం అందించిన అమ్మ ఒడి పథకం ద్వారా ఇంటర్ వరకు సులువుగా సాగిపోయింది. డిగ్రీ చదవాలంటే పార్వతీపురం వెళ్లాల్సిందే.
అంత ఖర్చు ఎలా భరించాలో తెలీక అమ్మానాన్న మొదట భయపడ్డారు. మా ఊరి పెద్దల సూచనతో హాస్టల్‌లో ఉండి చదువుకుంటే ప్రభుత్వం వసతి దీవెన, విద్యా దీవెన వంటి పథకాలు అందిస్తుందని చెప్పడంతో పార్వతీపురం ఎస్‌వీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరాను. నాకు విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా ఇప్పటి వరకు రూ.40 వేలు అందింది.
దాంతో అమ్మనాన్నలకు భారం కాకుండా చదువు సాగిపోతోంది. ఇప్పుడు నేను డిగ్రీ ద్వితీయ సంవత్సరం. డిగ్రీ పూర్తయ్యాక ఏదైనా ఉద్యోగం చేసి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాను. కొండపోడు వ్యవసాయం చేస్తున్న మా నాన్నకు వైఎస్సార్ రైతు భరోసా గతేడాదే వర్తించింది. ఈ ప్రభుత్వం లేకపోయుంటే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్లం. – ఆరిక సాయికిరణ్, సంతోషపురం, కురుపాం మండలం (ఆశపు జయంత్‌కుమార్, విలేకరి, పార్వతీపురం రూరల్)
Comments
Please login to add a commentAdd a comment