ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
మా బతుకులు బాగుపడ్డాయి
మాది రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. మా ఆయన నాగరాజుతో కలిసి వ్యవసాయ పనులతోపాటు పాడి ఆవులు పెట్టుకున్నాం. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు గ్రామంలోని పెద్ద దళితవాడలో ఉంటున్న మేము అరకొర ఆదాయంతోనే ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి సాయానికి నోచుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు వలంటీర్‌గా అవకాశం వచ్చింది. రెండేళ్ల క్రితం పాడి ఆవుల కోసం రూ.2 లక్షలు పొదుపు రుణం తీసుకున్నాం. రూ.1.50 లక్షలతో రెండు పాడి ఆవులు కొన్నాం.
రూ.50 వేలతో పశుగ్రాసం కోసం కొంత భూమిని కౌలుకు తీసుకున్నాం. రోజూ ఉదయం, సాయంత్రం 30 లీటర్ల పాలు వస్తున్నాయి. అమూల్ డెయిరీకి పాలు పోయడం ద్వారా నెలకు రూ.27 వేలు వస్తోంది. దాణా, ఇతర ఖర్చులు పోను నెలకు రూ.10 వేలు మిగులుతోంది. 5వ తరగతి చదువుతున్న మా అమ్మాయి వర్షిత ప్రియకు అమ్మ ఒడి వస్తోంది. ఇప్పటి వరకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున, నాలుగు విడతల్లో రూ.60 వేలు వచ్చింది. మా అత్త మల్లక్కకు వైఎస్సార్ చేయూత పథకంలో ఏటా రూ.18,750 వస్తోంది. వృద్ధాప్య పింఛన్ రూ.3 వేలు వస్తోంది. ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో హాయిగా బతుకుతున్నాం. జగనన్న సాయంతోనే మా బతుకులు బాగుపడ్డాయి. – మంచూరి దుర్గ, అంగళ్లు (సిద్దల కోదండరామిరెడ్డి, విలేకరి, కురబలకోట)
నేను టీడీపీ.. అయినా ఇల్లు ఇచ్చారు
చిన్న తనం నుంచీ టీడీపీ అంటే పిచ్చి. పసుపు చొక్కా వేసుకొని జెండా పట్టుకొని తిరిగే వాడిని. నన్ను అందరూ టీడీపీ కార్యకర్తగా ముద్ర వేశారు. 20 ఏళ్లుగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం జమ్ములో ఓ అద్దె ఇంట్లో ఉంటూ చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించాను. సొంత ఇంటి కోసం ఆ ప్రభుత్వ కాలంలో ఎంతో ప్రయత్నించాను. అందరి వద్దకూ వెళ్లాను. స్థలం ఉంటే ఇల్లు ఇస్తామన్నారు. స్థలం కొనుగోలు చేసే స్తోమత లేక ఆ ఆశ వదులుకున్నాను. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక జగనన్న కాలనీల్లో ఇంటి స్థలం ఇస్తూ ఇల్లు మంజూరు చేస్తున్నారు అంటే దరఖాస్తు చేశాను.
జమ్ము పంచాయతీ గడ్డెయ్యపేటలో జగనన్న కాలనీలో స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకునేందుకు రూ.1.80 లక్షలు ఇచ్చారు. డ్వాక్రా నుంచి నా భార్యకు మరో రూ.30 వేలు అప్పుగా ఇచ్చారు. మరికొంత అప్పు చేసి మా కల నెరవేర్చుకున్నాం. భార్య, కుమార్తెతో హాయిగా జీవిస్తున్నాం. నా భార్య శశికళకు రూ.12 వేలు డ్వాక్రాలో రుణ మాఫీ అయ్యింది. కుమార్తెకు విద్యా దీవెన పథకంలో మూడేళ్లలో రూ.60 వేలు వచ్చింది. ఇప్పుడు మాకు ఎలాంటి ఆర్థిక సమస్యా లేదు. ఇప్పుడు జగనన్న గెలుపే నా లక్ష్యం. – పొట్నూరు జగదీష్, గడ్డెయ్యపేట (మామిడి రవి, విలేకరి, నరసన్నపేట)
ప్రభుత్వ పథకాలతో బతుకు చింత తీరింది
మాది పేద కుటుంబం. నేను, మావారు చేనేత పనులు చేస్తుండేవాళ్లం. ముగ్గురు పిల్లలు పుట్టాక నా భర్త నన్ను వదిలేయడంతో మగ్గం పనులు చేస్తూనే వారిని పెంచి పెద్ద చేశాను. ముగ్గురికీ పెళ్లిళ్లు చేశాను. అబ్బాయి బంగారం వర్క్ షాపులో పని చేస్తుంటాడు. కోడలు, మనవడితో కలిసి పాత మంగళగిరిలో ఉంటున్నాం. నాకు వచ్చే పెన్షన్‌తో జీవనం కొనసాగిస్తున్నా. ఇప్పుడు ఓపిక లేక పనులకు కూడా వెళ్లడం లేదు.
ఒకరోజు ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చింది. డాక్టర్లను సంప్రదిస్తే ఆపరేషన్ చేయాలన్నారు. సుమారు ఏడు లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. కాళ్లూ చేతులు ఆడలేదు. అసలే ఆదాయం అంతంత మాత్రం. ఏమి చేయాలో అని ఆలోచిస్తున్న తరుణంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మాకు శ్రీరామ రక్షగా నిలిచింది. లక్షలు ఖర్చు చేసే ఆపరేషన్‌ను విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ఉచితంగా చేశారు.
దీంతో నా ఆరోగ్యం మెరుగు పడింది. ఆరోగ్యశ్రీ లేకపోతే నా కుటుంబం రోడ్డున పడేది. నాకు సీఎం జగన్ పునర్జన్మ ప్రసాదించారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏటా రూ.18,750 అందుతోంది. దానిని కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నా. మా మనవడికి అమ్మ ఒడి డబ్బులు రావడంతో వాడి చదువులకు చింత లేకుండా పోయింది. ప్రభుత్వ పథకాలు మా కుటుంబాన్ని ఆదుకుంటున్నాయి. – చెరుకు ఆదిలక్ష్మి, పాత మంగళగిరి (ఐ.వి.రెడ్డి, విలేకరి, మంగళగిరి)
Comments
Please login to add a commentAdd a comment