ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
చిన్నపాటి వ్యాపారంతో చింత తీరింది
మాది నిరుపేద కుటుంబం. విజయనగరం గజపతినగరం మండలం కొణిశ గ్రామ ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్నాం. కుటుంబంలో అందరం రోజు కూలీలమే. ప్రతి రోజూ కూలి లభించేది కాదు. దీంతో రోజు గడవడం కష్టంగా మారింది. మా ఆయన చేసిన కూలీకి వచ్చే డబ్బులు దుబారా చేసేవాడు. ఇంటికి సక్రమంగా ఇచ్చేవాడు కాదు. పిల్లలను పెంచడానికి ఇబ్బంది పడేదాన్ని. ఆ సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలిచింది.
జగనన్న తోడు పథకానికి దరఖాస్తు చేసుకోగానే ఏడాదికి రూ.పది వేలు వంతున వచ్చింది. దీనికి తోడు వైఎస్సార్ ఆసరా ద్వారా వచ్చిన రూ.12,500 కలిపి ఆ మొత్తంతో ఇంట్లోనే చిన్నపాటి పాన్ షాపు పెట్టుకున్నా. మా అబ్బాయి వినయ్ ఇప్పుడు ఏడో తరగతి చదువుతున్నాడు. అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేలు వంతున మూడేళ్లుగా అందుతోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మామ గారికి పింఛన్ కూడా అందుతోంది. కుటుంబం ఆరి్ధకంగా నిలదొక్కుకుంది. మమ్మల్ని ఆదుకున్న ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – సాంబారిక మంగ, కొణిశ (పాండ్రంకి అప్పలనాయుడు, విలేకరి, గజపతినగరం రూరల్)
అద్దె ఇంటి బాధ తప్పింది
మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. నాకు భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు. విజయనగరం జిల్లా జి.సిగడాం మండలం, పెనసాం గ్రామంలో నివాసం. కుటుంబ పోషణ కోసం భార్యా, పిల్లలతో గుంటూరు వలస వెళ్లాను. అక్కడ రోజు వారీ వేతనదారుగా మిర్చి గోదాంలో పనికి చేరాను. రాబడి అంతంత మాత్రమే. అద్దె ఇళ్లలో ఉంటూ అవస్థలు పడ్డాం. ఆ తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ చేరుకున్నాం. ఇక్కడ కూడా అద్దె ఇళ్లలోనే నివాసం. కష్టపడిన సొమ్ము అద్దెకే సరిపోయేది. నా భార్య బొంతలు కుడుతూ ఆరి్థకంగా సహకరించినా.. ఎదుగుతున్న పిల్లలు, పెరుగుతున్న వారి అవసరాలు.. నిత్యం ఆందోళనగా ఉండేది.
గత ప్రభుత్వాల నుంచి ఎలాంటి పథకాలు అందలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగనన్న ప్రభుత్వం అండగా నిలిచింది. అమ్మఒడి ఆదుకోవడంతో పిల్లలు బడిబాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందాల్సిన అన్ని సౌకర్యాలు సమకూరాయి. జగనన్న అర్బన్ కాలనీలో సెంటు స్థలం మంజూరైంది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఆరి్థక సాయం అందింది. ఇక్కడ సొంత గృహాన్ని కట్టుకున్నాం. ఇటీవలే గృహ ప్రవేశం చేశాం. మమ్మల్ని చూసి నిట్టూర్చిన వారే.. నేడు భుజం తడుతున్నారు.
– పిల్లల జగదీశ్వరావు, పాలకొండ (మారోజు కళ్యాణ్‌కుమార్, విలేకరి, పాలకొండ)
ధైర్యంగా జీవిస్తున్నాం
మాది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. భార్య, ఇద్దరు కూతుళ్లను పోషించుకునేందుకు నానా పాట్లు పడ్డాను. చివరకు బతుకు తెరువుకోసం కువైట్ వెళ్లాను. 2018లో పక్షవాతం రావడంతో సొంత ఊరైన వైఎస్సార్ జిల్లా చాపాడు గ్రామానికి తిరిగొచ్చేశా. ఉన్న కాస్త డబ్బులూ వైద్యానికే ఖర్చయిపోయాయి. జీవనోపాధి లేక, కుటుంబ పోషణకు ఎన్ని నిద్రలేని రాత్రుళ్లు గడిపానో భగవంతుడికే తెలుసు. 2019లో జగనన్న అధికారంలోకి వచ్చాక మా బాధలు తీరాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మా కుటుంబానికి ఆసరాగా నిలిచాయి.
పెరాలసిస్ రోగిని కావడంతో ప్రతి నెలా ఒకటో తేదీనే రూ.5 వేలు పింఛన్ అందుతోంది. రైతు భరోసా పథకంలో ఏటా రూ.13,500 మా బ్యాంకు ఖాతాలో జమవుతున్నాయి. నా భార్య మాబుఛాన్‌కు వైఎస్సార్ చేయూత పథకంలో ఏటా రూ.18,750 చొప్పున అందింది. ఆసరా పథకంలో ఏటా రూ.7,200 బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. నా కుమార్తె కౌసర్‌భాను గ్రామ వలంటీర్‌గా చేస్తోంది. మరో కుమార్తె ముబారక్ ప్రైవేట్ స్కూల్ టీచర్‌గా పని చేస్తోంది. ఉన్న కాస్త పొలంలో ఓపిక ఉన్నంత మేరకు వ్యవసాయం చేసుకుంటూ, ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలతో కుటుంబాన్ని ధైర్యంగా పోషించుకోగలుగుతున్నా. మాలాంటి కుటుంబాలకు అండగా నిలుస్తున్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. – కొర్రపాటి అబ్దుల్ రసూల్, చాపాడు గ్రామం (శ్రీపతి సుబ్బయ్య, విలేకరి, చాపాడు)
Comments
Please login to add a commentAdd a comment