ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.
కష్టాల నుంచి బయటపడ్డాం
మాది సామాన్య కుటుంబం. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని నంబర్–1 పాఠశాల సమీపంలో నివసిస్తున్నాం. నా భర్త 2014లో మృతి చెందిన తరువాత నేను టైలరింగ్ చేయడం మొదలుపెట్టాను. అయినా కుటుంబాన్ని పోషించుకోవడం కొంచెం కష్టంగా మారింది. జగనన్న అధికారంలోకి వచ్చాక మేం ఆర్థిక సమస్యల నుంచి బయటపడ్డాం. మా ఇంటికి వలంటీర్ వచ్చి నాతో పింఛనుకు దరఖాస్తు చేయించారు.
పింఛన్ మంజూరైంది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రుణమాఫీ మొత్తం రూ.54,400లు, వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఏడాదికి రూ. 18,750లు వంతున అందింది. జగనన్న చేదోడు పథకం ద్వారా ఏడాదికి రూ. పదివేలు వంతున వచ్చింది. నా కుమారుడు ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. నేను ప్రస్తుతం టైలరింగ్ చేసుకుంటూ జగనన్న పుణ్యంతో çఎటువంటి సమస్యలూ లేకుండా సంతోషంగా జీవిస్తున్నాం. జగనన్న అందిస్తున్న సాయానికి మా కుటుంబం రుణపడి ఉంటుంది.
– షేక్ మీరా బేగం, మొగల్తూరు (వి.లక్ష్మీ గణేష్, విలేకరి, మొగల్తూరు)
సమస్యలు తీరి సంతోషంగా జీవనం
మాది పేద కుటుంబం. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం ఇందుకూరుపేటలో గతంలో కూలీ పనులు చేసుకుని జీవించేవాళ్లం. వచ్చిన అరకొర ఆదాయంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండేది. వయసు రీత్యా కొంత అనారోగ్యంతో పనులకు వెళ్లలేకపోయాం. గత ప్రభుత్వం ఏ విధంగానూ మాకు సాయం అందించలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు కొండంత అండగా నిలిచాయి.
వైఎస్సార్ పింఛన్ అందుతోంది. నా భార్యకు కాపు నేస్తం కింద ఏడాదికి రూ.15 వేలు వంతున అందింది. రైతు భరోసా ద్వారా ఇప్పటివరకు ఏటా రూ. 13,500లువంతున, టైలరింగ్ చేసే నా కోడలికి జగనన్న చేదోడు పథకం ద్వారా ఏడాదికి రూ. పదివేలు వంతున, వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.50 వేలు జమయ్యాయి. నా మనవరాలికి అమ్మఒడి పథకం ద్వారా ఏడాదికి రూ. 15వేలు అందింది. జగనన్న ప్రభుత్వంలో మా పేద కుటుంబం కష్టాలు తీరాయి. మా కుటుంబమంతా జగనన్నకు రుణపడి ఉంటుంది. – రావిపాటి చెల్లారావు, దేవీపట్నం (కె.వెంకటేశ్వరరావు, విలేకరి, దేవీపట్నం)
అద్దె ఇంటి బాధ తప్పింది
మాది వ్యవసాయ కుటుంబం. నా భర్త కుటుంబరావుకు నేను తోడుగా ఉండి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో వ్యవసాయం చేసేవాళ్లం. అన్ని సీజన్లూ అనుకూలంగా ఉండేవి కాదు. అప్పుడప్పుడు పంట చేతికందకపోతే నష్టాలు చవిచూసేవాళ్లం. అప్పుడు అప్పులు చేయాల్సి వచ్చేది. మమ్ములను గత ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదు. కనీసం ఇల్లయినా మంజూరు చేయలేదు. ఇక సొంతిల్లు కలగానే మిగిలిపోతుందని భయపడ్డాం.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ కల తీరింది. మాకు ఇంటి స్థలమే గాకుండా ఇంటి నిర్మాణానికి రూ. 1.80లక్షలు ఆర్థిక సాయం అందించింది. ఇంటినిర్మాణం పూర్తికావచ్చింది. మా అబ్బాయి ఉన్నత చదువులు చదువుతున్నాడు. వాడికి జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.90,500లు, వసతి దీవెన ద్వారా రూ.50 వేలు వచ్చింది. నాకు వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.13,909, వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా రూ.6,255, వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ. 13,500 వంతున వచ్చింది. ఇన్ని విధాలుగా ఆదుకున్న జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – వల్లూరి వాణి, మైసన్నగూడెం (అచ్యుతరామ్, విలేకరి, జంగారెడ్డిగూడెం రూరల్)
Comments
Please login to add a commentAdd a comment