అనకాపల్లి సామాజిక సాధికార యాత్ర సభలో ప్రసంగిస్తున్న ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర
సాక్షి, అనకాపల్లి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బడుగుల రాజ్యాన్ని స్థాపించారని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పెద్దపీట వేసిన తొలి సీఏం వైఎస్ జగన్ అని చెప్పారు. గురువారం అనకాపల్లిలో జరిగిన సామాజిక సాధికార సభలో ఆయన ప్రసంగించారు.
రాష్ట్ర కేబినెట్లో 25 మంది మంత్రులకుగాను 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనని, ఇతర అన్ని పదవుల్లోనూ ఈ వర్గాలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనన్ని పదవులు, పథకాలు అందించి సామాజిక సాధికారత తీసుకొచ్చారన్నారు. బీసీలకు రూ.1.62 లక్షల కోట్లు, దళితులకు రూ.61 వేల కోట్లు, గిరిజనులకు రూ.20 వేల కోట్లను వెచ్చించారని తెలిపారు.
అడవి బిడ్డ అయిన తనను ఉపముఖ్యమంత్రిని చేసి పక్కనే కూర్చోబెట్టుకున్న నాయకుడు జగనన్న అని కొనియాడారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు ఎల్లవేళలా మంచిగా ఉండాలంటే మళ్ళీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని చెప్పారు. గిరిజనులు సాధారణంగా సౌమ్యంగా ఉంటారని, ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తే వారిపై ఒక్కొకరు ఒక్కో అల్లూరి సీతారామరాజులా పోరాడతారని హెచ్చరించారు.
జగన్ చెప్పారంటే చేస్తారు: బూడి
చెప్పిన మాట తూచా తప్పకుండా చేసే సీఎం వైఎస్ జగన్ అని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99.5% అమలు చేయడమే కాకుండా, చెప్పని అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అవ్వా తాతలకు వచ్చే నెల నుంచి రూ.3 వేల పింఛను అందించనున్నారన్నారు. బడుగు బలహీనవర్గాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఆకాంక్షతో వారికి యూనిఫాం, నాణ్యమైన భోజనం, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలే కాకుండా అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నారని తెలిపారు. 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు మూడు విడతల చేయూత అందించారని, నాలుగో విడత సంక్రాంతి పండుగ తర్వాత అందించనున్నారని చెప్పారు.
గర్వంగా మీ వద్దకు వచ్చాం: మంత్రి ధర్మాన
నాలుగున్నరేళ్ల పాలనలో మేనిఫెస్టోలో హామీలన్నీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నెరవేర్చడంతో.. బడుగు వర్గాలకు అందించిన సాధికారతను కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకునేందుకు మీ ముందుకు వచ్చామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళా సాధికారత కూడా నెరవేరిందన్నారు. ఈ ప్రభుత్వంలో స్త్రీని అత్యంత శక్తివంతురాలుగా చేసి, వారి ఖాతాల్లోకే సంక్షేమ పథకాల నగదు జమయ్యేలా చేశారన్నారు. తాను పస్తు ఉండి ఇంటిల్లిపాదికీ అన్నం పెట్టేదే స్త్రీ మూర్తి అని, ఇంటిలో ఇల్లాలి చేతిలో డబ్బులుంటే ఆ ఇంట్లో వెలుగులుంటాయని నమ్మిన సీఎం జగన్ అని చెప్పారు.
అనేక కులాలకు గుర్తింపు: మంత్రి గుడివాడ
ఇప్పటివరకు గుర్తింపు లేని అనేక కులాలకు గుర్తింపు తెచ్చిన సీఎం జగన్ మాత్రమేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. నాలుగున్నరేళ్లలో అనకాపల్లి నియోజకవర్గంలో రూ.880 కోట్లతో సంక్షేమ పథకాలను అందించామంటే ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. 20 వేల మంది పేదలకు సొంతింటి కల నెరవేరిందన్నారు. జగనన్న పాలనలో ప్రతి పేదోడు తలెత్తుకు జీవిస్తున్నాడని, జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే మన పిల్లల భవిష్యత్తు బావుంటుందని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చెప్పారు.
మాయలోడు చంద్రబాబు వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, అల్లూరి సీతారామరాజు ఆశయాలను నెరవేరుస్తూ సామాజిక న్యాయం సాధించిన ఘనత సీఎం జగన్‌దే అని ఎంపీ డాక్టర్ బి.వి. సత్యవతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, డీసీసీబీ చైర్మన్ కోలా గురువులు, ఏపీఐడబ్యూఏ చైర్మన్ దంతులూరి దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment