
యూదుల ధర్మశాస్త్రంతో సాదోక్ యాకోబి
తెనాలి: ఇజ్రాయెల్‌పై దాడులతో గుంటూరు జిల్లాలోని కొత్తరెడ్డిపాలెంలోని యూదు సమాజం నిర్ఘాంతపోయింది. అతి ముఖ్యమైన పండగ సంబరాలను రద్దు చేసుకుంది. కేవలం ఇజ్రాయెల్‌లో శాంతిని కాంక్షిస్తూ ధర్మశాస్త్రాన్ని ప్రార్థించడంతో సరిపెట్టుకున్నారు. అక్కడి మృతులకు నివాళి అర్పించారు.
పురాతన సునగోగు..
ఆంధ్రప్రదేశ్‌లోని యూదుల పురాతన ప్రార్థన మందిరం ‘బెనె యాకోబు సునగోగు’. జిల్లాలోని చేబ్రోలు మండల గ్రామం కొత్తరెడ్డిపాలెంలో ఉంది. వందల ఏళ్లుగా తెలుగు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన ఇజ్రాయెల్ మూలాల యూదుల్లో మాతృభాష, ఆచార వ్యవహారాల పరిరక్షణ ఈ సమాజ మందిరం కేంద్రంగా కొనసాగుతోంది. మందిరం నిర్వాహకుడు, ఏడుగురు పెద్దల నాయకత్వంలో అక్కడ 40 కుటుంబాలు తమ మూలాలను కాపాడుకుంటూ వస్తున్నాయి. వీరంతా యూదు జాతి సంతతిలోని ఎఫ్రాయిమ్ గోత్రికులు.
ఎక్కువమంది వ్యవసాయ కూలీలు. చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడిన వారున్నారు. అందరికీ యూదు పేరు, హిందూ పేరు ఉంటాయి. స్వయంగా రక్తాన్ని చిందించిన మాంసాన్నే (కౌషర్) ముడతారు. దేవుడి పేరును వీరు ఉచ్ఛరించరు. ప్రతి శనివారం విశ్రాంతి దినం ‘సబ్బాత్’. దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ గడుపుతారు. ఆదివారం తమ మాతృభాష అయిన హిబ్రూ స్కూలును నడుపుతూ భాషను ముందుతరాలకు అందిస్తున్నారు. హిబ్రూ క్యాలెండరు ప్రకారం సృష్టి ఆరంభం నుంచి ఇది 5784 సంవత్సరం. ముఖ్యమైన ఏడు పండుగలను జరుపుకొంటారు. సృష్టి పుట్టిన దినాన్ని కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు. ఏటా ‘తిష్రి’ నెల సెప్టెంబరు ఒకటో తేదీన వస్తుంది. మరో పదిరోజులకు ప్రాయశ్చిత్త పండుగ (యోమె కిఫ్ఫూర్), తర్వాత పర్ణశాలల పండుగ (సుక్కోత్)ను ఏడురోజులు జరుపుకొంటారు. 8వ రోజున ‘ధర్మశాస్త్రం నందు ఆనందించటం’ (సింహత్వర) చేస్తారు.
సింహత్వర సంబరాలు రద్దు..
కొత్తరెడ్డిపాలెం యూదులు 5784 సంవత్సరం పర్ణశాలల పండుగను చేసుకున్నారు. ఆదివారం 8వ రోజైన ‘సింహత్వర’ను జరుపుకోవాల్సి ఉంది. ఇందుకు కొన్ని గంటల ముందుగానే ఇజ్రాయెల్‌లోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి వేల రాకెట్లు ప్రయోగించటం, ఈ దాడుల్లో ఇజ్రాయెలీలు పలువురు మరణించిన సమాచారం తెలియటంతో ఇక్కడి యూదులు కలవరం చెందారు. పండుగల సంబరాలతో ఆరంభం కావాల్సిన రోజు ‘బెనె యాకోబి సునగోగు’ విచారంలో మునిగింది. వాస్తవానికి ఈ రోజు, భద్రపరిచిన ‘ధర్మశాస్త్రం’ను వెలుపలికి తీసి, సంఘీయులంతా కలిసి మందిరం చుట్టూ ఏడు ప్రదక్షిణ చేస్తారు.
‘ఇజ్రాయెల్‌లోనైతే వీధుల్లో ఊరేగిస్తారు...ఇక్కడ ఇతర కులాలు, మతాలు ఉంటున్నందున కేవలం మందిరం చుట్టూనే తిప్పుతాం’ అని మందిర నిర్వాహకుడు సాదోక్ యాకొబి చెప్పారు. డ్రమ్స్ వాయిద్యాల హోరులో పాటలు, నృత్యాలతో అంతా ప్రదక్షిణలో పాల్గొంటారు. ధర్మశాస్త్రం ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటారు. విందు చేస్తారు. యూదులకే ధర్మశాస్త్రం సొంతం అంటారు వీరు. ఇందులో 613 ఆజ్ఞలు ఉంటాయి. మిగిలినవారికి ఏడు ఆజ్ఞలు మాత్రమే ఉంటాయి. అందుకే ఆ ప్రత్యేకతను ‘సింహత్వర’గా సంబరం చేసుకుంటాం’ అని అని సాదోక్ యాకొబి వివరించారు.
శాంతి కోసం ప్రార్థనలు..
ఇజ్రాయెల్‌పై మిలిటెంట్ల దాడులతో కలత చెందిన వీరంతా సింహత్వర పండుగను రద్దుచేసుకున్నారు. మందిరంలోని ధర్మశాస్త్రాన్ని భక్తిశ్రద్ధలతో బయటకు తీశారు. అంతా కలిసి ప్రార్థనలు శారు. ఇజ్రాయెల్‌లో శాంతి నెలకొనాలని కోరుకున్నారు. దాడులకు పాల్పడినవారికి తగిన తీర్పు జరుగుతుందని ఆకాంక్షించారు. చివరగా మృతులకు నివాళులర్పించారు. సాదిక్ యాకోబి ఆధ్వర్యలో షమూయేల్ యాకోబి, దావీదు, విజయసింహ, మిరియం విక్టోరియా, ఆనందపాల్ తదితరులు పాల్గొన్నారు.
2004లోనే వీరి ఉనికి వెల్లడి...
క్రీస్తుపూర్వం 772, 445ల్లో టర్కీ, బబులోన్ దాడులతో చెల్లాచెదరైన ఇజ్రాయెలీల్లో కొందరు పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా జమ్మూకశ్మీర్‌కు చేరుకున్నారు. మరికొందరు ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుని తెలంగాణలో స్థిరపడ్డారు. తర్వాత అమరావతి చేరుకుని జీవనం సాగించారు. బ్రిటిష్ హయాంలో ఒకరికి ఉద్యోగం రావటంతో మకాం కొత్తరెడ్డిపాలెంకు మారింది. 1909లో పూరిపాకలో ఆరంభించిన సమాజ మందిరాన్ని 1991లో పునర్నిర్మించారు. 2004లోనే కొత్తరెడ్డిపాలెం యూదుల గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పట్లో ఇక్కడి యూదులను మట్టుపెట్టేందుకు కుట్రపన్ని, రెక్కీ నిర్వహించారనే ఆరోపణపై ప్రభుత్వం, లష్కరే తోయిబాకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేసింది. రాష్ట్రంలో మొత్తం 125 యూదు కుటుంబాలు ఉంటున్నాయని అంచనా.