నేడు పేటకు శ్రీశృంగేరీ పీఠం ఉత్తరాధికారి | - | Sakshi
Sakshi News home page

నేడు పేటకు శ్రీశృంగేరీ పీఠం ఉత్తరాధికారి

Published Wed, Nov 20 2024 1:52 AM | Last Updated on Wed, Nov 20 2024 1:52 AM

నేడు

నేడు పేటకు శ్రీశృంగేరీ పీఠం ఉత్తరాధికారి

తెనాలి : అద్వైత పీఠాల్లో అత్యంత ప్రశస్తమైన శ్రీశృంగేరీ పీఠం ఉత్తరాధికారి శ్రీవిదుశేఖర భారతీస్వామి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ నెల 18, 19వ తేదీల్లో విజయవాడలో బస చేశారు. 20, 21వ తేదీల్లో నరసరావుపేట, 22, 23వ తేదీల్లో గుంటూరులో ఉంటారు. చిన్న వయసులోనే శారదా పీఠం ఉత్తరాధికారిగా నియమితులైన స్వామి శ్రీశృంగేరీ పీఠానికి తదుపరి 37వ జగద్గురువులని తెలిసిందే. ఉమ్మడి గుంటూరు జిల్లాతో స్వామికి అనుబంధం ఉంది.

తెనాలి సమీపంలోని కృష్ణానదీ తీరంలో ఉన్న అనంతవరం వీరి స్వగ్రామం. తల్లిదండ్రులు సీతానాగలక్ష్మి, కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని. వేదాలు, వేదభాష్యంలో ప్రఖ్యాత పండితుడైన శివసుబ్రహ్మణ్య అవధాని తిరుమలలోని టీటీడీ వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్‌గా, ఎస్‌వీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ వేదిక్‌ స్టడీసీ, టీటీడీ ప్రాజెక్టు అధికారిగా పని చేస్తున్నారు. వీరి రెండో కుమారుడు వెంకటేశ్వరప్రసాద శర్మ. 1993 జులై 24న తిరుపతిలో జన్మించారు. అయిదేళ్ల వయసులోనే కుమారుడికి ఉపనయనం చేయించారు.

కృష్ణ యజుర్వేదమే తొలి పాఠం...

తాత కృష్ణ యజుర్వేద పాఠాలే తొలి అభ్యాసం. తండ్రి వద్ద కృష్ణ యజుర్వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేశారు. కుప్పా వంశీకులు హంసల దీవిలోని వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక భాగవత సప్తాహాలు జరుపుతుంటారు. వేద విద్యలో కొనసాగుతున్న ప్రసాద శర్మ, ఇలాంటి దైవ కార్యాల్లో పాల్గొంటూ, తండ్రితో కలిసి దేశంలోని పుణ్య క్షేత్రాలన్నింటినీ సందర్శించారు. 2006లో శృంగేరీ శారదా పీఠంలో తాత, తండ్రితో కలిసి ఓ ధార్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. 2009లో శృంగేరీ పీఠం జగద్గురును దర్శించుకున్నపుడు స్వామి శిష్యరికంలో శాస్త్రాలు నేర్చుకోవాలన్న అభిలాషను వ్యక్తం చేశారు.

జగద్గురు బోధనలతో...

ఆ విధంగా శృంగేరీ జగద్గురు అనుగ్రహానికి 22 ఏళ్ల వయసులోనే నోచుకున్నారు. న్యాయ, వేదాంత, వ్యాకరణాది శాస్త్రాలను, అక్కడి ఉద్దండ పండితుల వద్ద సంస్కృతం, కవిత్వం, సాహిత్యం తదితరాలను అధ్యయనం చేశారు. అతి తక్కువ వ్యవధిలోనే అపార పాండిత్యం గడించారు. ఆయా శాస్త్రాలను అధ్యయనం చేసిన కాలంలో అనుష్టానం, తపస్సు మినహా లౌకికమైన విషయాల్లో ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఆయన ప్రతిభను గ్రహించిన జగద్గురు తానే స్వయంగా శాస్త్రాలను బోధించారు. దీంతో తర్కశాస్త్ర పండితుడుగా అవతరించారు. ప్రతిష్ఠాత్మక వ్యాక్యార్థ విద్వత్‌ సభలు, ఏటా జరిగే జాతీయ శాస్త్ర పండితుల సభల్లోనూ తన ప్రసంగాలతో అందరినీ ఆశ్చర్యపరచ సాగారు. తర్వాత మీమాంస శాస్త్రం నేర్చారు. వేదాంతం నేర్చుకుంటూనే విద్యార్థులకు తర్కం, మీమాంస, వ్యాకరణశాస్త్రం బోధించసాగారు.

తల్లిదండ్రులు సీతానాగలక్ష్మి,

కుప్పా శివసుబ్రహ్మణ్య అవధానితో..

చిన్న వయసులోనే సన్యాస దీక్ష...

విద్యార్జనలో అసాధారణ ప్రజ్ఞ చూపిన వెంకటేశ్వర ప్రసాద శర్మకు అరుదైన గౌరవం లభించింది. 2019 జనవరి 22, 23వ తేదీల్లో శృంగేరీలోని తుంగానదీ తీరంలో శారదాదేవి ఆలయ సమక్షంలో యోగ పట్టాను, సన్యాస దీక్షను శ్రీభారతీ తీర్థ మహాస్వామి చేతుల మీదుగా స్వీకరించారు. శ్రీవిదుశేఖర భారతీస్వామిగా నామకరణం చేసి, తదుపరి 37వ జగద్గురుగా నిర్ణయించి ఉత్తరాధికారిగా నియమించారు. పీఠం చరిత్రలో ఈ పదవిలో నియమితులైన పిన్న వయస్కుల్లో వీరిని రెండో వారుగా చెబుతారు. పీఠం నియమాల ప్రకారం శ్రీభారతీ తీర్థ మహాస్వామి ఆదేశాలతో సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా దక్షిణ భారతదేశ శోభాయాత్రలో పాల్గొన్నారు. అతి చిన్నవయసులోనే దక్షిణ భారతదేశంలో పూర్తిగా సంచరించి, ప్రజలకు స్వధర్మ ఆచరణ వైశిష్ట్యాన్ని వివరిస్తూ, ధర్మాచరణ ఆవశ్యకతను బోధించారు. శోభాయాత్రలో భాగంగా నాడు తెనాలినీ సందర్శించారు. మళ్లీ ఇప్పుడు ధర్మ ప్రచారంలో భాగంగా రాష్ట్ర పర్యటను విచ్చేసిన భారతీస్వామి ఉమ్మడి గుంటూరు జిల్లాకు వస్తున్నారు.

గుంటూరు జిల్లాతో శ్రీవిదుశేఖర భారతీ స్వామీజీకి ప్రత్యేక అనుబంధం

శ్రీవిదుశేఖర భారతీ స్వామి పెద్దలకు 1961 నుంచి శృంగేరీ పీఠంతో అనుబంధముంది. అప్పట్లో 35వ జగద్గురు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాతీర్థస్వామి వచ్చినపుడు, వీరి తాత సోదరుడు బైరాగిశర్మ స్వాగతం పలికి పాదపూజ చేశారు. 1985లో శృంగేరీ పీఠాధిపతికి ఇక్కడ ఘన స్వాగతం లభించింది. వీరి మరో తాత కుప్పా వెంకట చలపతి యాజీ 2002లో పీఠాధిపతి అనుమతితో సన్యాస దీక్ష తీసుకున్నారు. ఆయన సోదరుడు కుప్పా రామ గోపాల వాజపేయీ కృష్ణ యజుర్వేద పండితుడు. శృంగేరీ జగద్గురు భక్తుడు. ఆ క్రమంలోనే శ్రీవిదుశేఖర భారతీస్వామి తండ్రి కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని జగద్గురు అభినవ విద్యాతీర్థ శాస్త్ర సంవర్ధిని పాఠశాలలో చదివారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నేడు పేటకు శ్రీశృంగేరీ పీఠం ఉత్తరాధికారి 1
1/2

నేడు పేటకు శ్రీశృంగేరీ పీఠం ఉత్తరాధికారి

నేడు పేటకు శ్రీశృంగేరీ పీఠం ఉత్తరాధికారి 2
2/2

నేడు పేటకు శ్రీశృంగేరీ పీఠం ఉత్తరాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement