అప్పు పుట్టడం గగనంగా మారింది
చీరాల టౌన్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని.. అయినా రాష్ట్రాన్ని ముందంజలో ఉంచేందుకు ప్రభుత్వం పనిచేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంగళవారం చీరాల మండలం దేవాంగపురి గ్రామ పంచాయతీలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.47.50 లక్షలతో నిర్మాణం చేసిన సీసీ రోడ్లను కలెక్టర్ వెంకట మురళి, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చీరాల ఆర్డీవో టి.చంద్రశేఖర నాయుడు అధ్యక్షత వహించారు. సభలో మంత్రి మాట్లాడుతూ చీరాలకు గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ప్రగడ కోటయ్య, గడ్డం కోటయ్యల గురించి అంతా తెలుసుకోవాలన్నారు. ఏపీకీ ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో సీఎం నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి సీఎం, డిప్యూటీ సీఎం ఎనలేని కృషి చేస్తున్నా ఆర్థిక పరిస్థితి ఆటంకంగా మారిందన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే సూపర్ సిక్స్ అమలు చేస్తామన్నారు. చీరాల నియోజకవర్గంలో చేనేతల కోసం టెక్స్‌టైల్ పార్కు, హార్బర్ పనులు త్వరలోనే పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ చీరాల్లో రూ.8 కోట్లు ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో 10 కిలోమీటర్ల మేర 96 సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. జిల్లాలో రూ.157 కి.మీ మేర 868 సీసీ రోడ్లను రూ.91 కోట్లతో నిర్మాణం చేస్తుండగా 70 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. జిల్లాలో 650 గోకులం షెడ్లు పూర్తి చేస్తున్నామన్నారు. చీరాల నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి రూ.4 కోట్లు కేటాయింపులో రూ.57లక్షలతో కొన్ని పనులు పూర్తయ్యాయని తెలిపారు. వాడరేవులో మారిటైం బోర్డు సహకారంతో హార్బర్ పనులు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. 4వేల మంది యానాదులకు ఆధార్‌కార్డులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు అధికారులు, ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్రవర్మ మాట్లాడుతూ చీరాల–బాపట్ల జంట నగరాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామన్నారు. అనంతరం అతిథులను జీడిపప్పు మాలతో సన్మానించారు. హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సజ్జా హేమలత, డ్వామా పీడీ విజయలక్ష్మి, తహసీల్దార్ గోపీకృష్ణ, ఎంపీడీవో శివసుబ్రమణ్యం, చీరాల డీఎస్పీ మెయిన్, సీఐలు శ్రీనివాసరావు, శేషగిరిరావు, టీడీపీ నాయకులు సిద్ది బుచ్చేశ్వరరావు, వీరభద్రయ్య, పురుషోత్తం, గజవల్లి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
సూపర్ సిక్స్ పథకాలను
ఎలాగైనా అమలు చేస్తాం
చేనేతల సమస్యలను సీఎం
దృష్టికి తీసుకెళ్లి అండగా నిలుస్తాం
సీసీ రోడ్లు ప్రారంభోత్సవంలో జిల్లా
ఇన్‌చార్జి మంత్రి పారర్థసారథి
Comments
Please login to add a commentAdd a comment