వాసవీ అమ్మవారికిప్రత్యేక పూజలు
రేపల్లె రూరల్: వాసవీ కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం సందర్భగా రేపల్లె పట్టణం ఓల్డ్ టౌన్‌లో గల వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే అమ్మవారికి సుప్రభాత సేవతో మేళతాళాలు, వేద మంత్రాల నడుమ పండ్ల రసాలు, పంచామృతాలతో ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. 102 మంది మహిళలు కలశాలతో పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చిన జలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి జీవిత చరిత్రను వివరించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 102 రకాల నైవేద్యాలు సమర్పించి, మొక్కుబడులు తీర్చుకున్నారు. లలితా సహస్ర నామ పారాయణ, కనకధారా స్తోత్రాలతో పాటు వాసవీ భక్తి గీతాల ఆలాపన, భజనలు జరిపారు. రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమ ర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి, అన్నసంతర్పణ చేశారు. సాయంత్రం అమ్మవారిని పురవీధుల్లో ప్రత్యేక వాహనంలో ఊరేగించారు.
మిర్చి యార్డు కార్యదర్శిగా చంద్రిక బాధ్యతల స్వీకారం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డు కార్యదర్శిగా ఎ.చంద్రిక శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. యార్డు ఇన్‌చార్జి సుబ్రమణ్యం నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించి, మొదటి ఫైల్‌పై సంతకం చేశారు. చంద్రిక కార్యదర్శిగా ఏడాదిపాటు డెప్యుటేషన్ మీద కొనసాగనున్నారు. చంద్రిక మాట్లాడుతూ అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన గుంటూరు మిర్చి యార్డుకు పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించుకునేందుకు యార్డుకు వచ్చే మిర్చి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది సహకారంతో గుంటూరు మిర్చి యార్డును ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. ప్రస్తుత సీజన్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామని ఆమె వివరించారు. పలువురు యార్డు అధికారులు, సిబ్బంది, పలు అసోసియేషన్ల నాయకులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రికను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద శుక్రవారం 2010 క్యూసెక్కులు విడుదల చేశారు. హై లెవల్ కాలువకు 106, బ్యాంక్ కెనాల్‌కు 130, తూర్పు కెనాల్‌కు 242, పశ్చిమ కెనాల్‌కు 120, నిజాంపట్నం కాలువకు 50, కొమ్మమూరు కాలువకు 930 క్యూసెక్కులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment