‘ఉప్పు’ బతుకులు దుర్భరం
చినగంజాం: ఉప్పు కొఠారు భూముల్లో కార్మికులు, కూలీల బతుకు నరకప్రాయంగా మారింది. తీవ్ర అసౌకర్యాల నడుమ పని చేయడానికి భయపడుతున్నారు. పూర్తిగా ప్రకృతి ఒడిలో పండించే ఉప్పు సాగుకు వేలాది కార్మికులు ఎండనక, వాననక ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయాలి. వ్యవసాయం మాదిరిగా పూర్తిగా భూమి, నీరు, సూర్యరశ్మి మీద ఆధారపడి పండించే పంట అయినప్పటికీ ఉప్పు సాగును పరిశ్రమగానే కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. అయితే, వసతులు కల్పనలో అధికారులు, భూ యజమానులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
బానిస బతుకులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొఠారు భూముల్లో తీవ్ర అసౌకర్యాలు నెలకొన్నాయి. బాపట్ల జిల్లాలో ఉప్పు సాగు చినగంజాం మండలంలో మాత్రమే చేస్తారు. భూములకు వెళ్లేందుకు రోడ్లు, కార్మికులకు తాగేందుకు నీరు, విశ్రాంతి భవనాలు, మరుగు దొడ్లు, కార్మికులకు అవసరమైన కళ్లజోళ్లు, బూట్లు, హెల్త్ కార్డులు, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి పథకాలు అందుబాటులో లేవు. దాంతో కార్మికులు, ముఖ్యంగా మహిళా కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మిక చట్టాలు అమలవుతున్న ప్రస్తుత తరుణంలోనూ ఉప్పు కార్మికులు బానిస బతుకులు కొనసాగిస్తున్నారు.
అవస్థలు వర్ణనాతీతం
కొఠారు భూముల్లో ఉప్పు ఉత్పత్తికి వేసవి కాలం ప్రధానం. ఆ సమయంలో కూలీలు అవస్థలు వర్ణనాతీతం. కాస్తంత దప్పిక తీర్చుకునేందుకు తాగునీటి కోసం గ్రామంలోకి రావాల్సిందే. నిలువ నీడ కూడా కరువవుతోంది. విశ్రాంతి షెడ్డులు కూడా లేవు. వర్షాకాలం వస్తే రోడ్లపై గుంతలలో నీరు నిలిచి నడిచి వెళ్లేందుకు కూడా అవకాశం లేదు. కొఠారు భూముల్లో పనిచేసే కార్మికుల సంక్షేమం, సౌకర్యాల కల్పనకు 70 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం, 30 శాతం నిధులను సాగు చేస్తున్న భూ యజమానులు భరాయించాల్సి ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉప్పుసాగు చేసే భూ యజమానులకు, లీజు దారుకు లీజ సమయంలో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అమలు కావడం లేదు. కొఠారు భూములలో ఉప్పులోడు చేసేందుకు వచ్చే వాహనాలతో రోడ్లు అధ్వానంగా మారినా వాటి బాగోగులు గురించి పట్టించుకొనే పరిస్థితి లేదు. రోడ్లు, చిల్లచెట్ల తొలగింపు వంటి పనులను సాగుదారులే చూసుకోవాలని ప్రభుత్వం సూచించినా ఫలితం లేదు. పిల్లిమెడలో గంట ఎవరు కట్టాలి అనే సామెత మాదిరిగా అటు ప్రభుత్వం, ఇటు లీజుదారులు కొఠారుల్లో సౌకర్యాల ఏర్పాటుకు ముందుకు రాకపోవడంతో కూలీలు అవస్థలు పడుతున్నారు.
కొఠారుల్లో మౌలిక వసతులు కరువు కార్మికుల సంక్షేమంపట్టించుకునే నాథుడే లేడు నిర్లక్ష్యంగా అధికారులు, భూ యజమానులు తీవ్ర అసౌకర్యాల నడుమ కార్మికులు, కూలీలు
మూడు వేల ఎకరాల్లో ఉప్పు సాగు
బాపట్ల జిల్లాలో చినగంజాం మండలంలో మొత్తం మూడు వేల ఎకరాల్లో ఉప్పు సాగు జరుగుతోంది. రూ. కోట్లలో ఆదాయం ఒనగూరుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సౌత్ సాల్ట్ ఫ్యాక్టరీ పరిధిలో 1300 ఎకరాలు, నార్త్ సాల్ట్ ఫ్యాక్టరీ పరిధిలో మరో 700 ఎకరాలు భూములకు సంబంధించి ఉప్పుశాఖ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తోంది. మిగతా రైతులు సాగు చేసుకుంటున్నారు. రైతులు ఉప్పు బస్తాకు రూ.32 చెల్లించాలి. అయితే , ఎకరంలో ఉత్పత్తి అయ్యే 400 బస్తాలకు గాను ప్రస్తుతం 200 మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పన్ను పూర్తి స్థాయిలో పన్ను చెల్లించలేకపోతున్నారు. ఉప్పుశాఖ ఆధీనంలోని భూములలో సుమారు 1,500 కుటుంబాలకు చెందిన సుమారు 6 వేల మంది కార్మికులు పనులు చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల భూముల్లోనూ తీవ్ర అసౌకర్యాలు ఎదురవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment