అదే తీరు.. అదే నోటి దురుసు
చీరాల: మున్సిపల్ చైర్మన్‌ను, కుర్చీని అవమానపరచిన టీడీపీ కౌన్సిలర్ ఎస్.సత్యానందం సభలో క్షమాపణ చెప్పాలంటూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని హాలులో శుక్రవారం కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే ఆయన్ను, చైర్మన్ సీటును 31వ వార్డు కౌన్సిలర్ సత్యానందం ఉద్దేశపూర్వకంగా అవమానించారని, సభకు ఆయన క్షమాపణ చెప్పాలంటూ వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే తాను సభను, చైర్మన్‌ను అవమానపరచలేదని, అయినా ఎవరికై నా ఇబ్బంది కలిగితే ఆ మాటలు వెనక్కి తీసుకుంటానని స్పష్టం చేశారు. అయితే, క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ తరుణంలో టీడీపీ కౌన్సిలర్ సత్యానందాన్ని మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
ఎమ్మెల్యే హాజరుతో హైడ్రామా
అదే సమయానికి ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మున్సిపల్ సమావేశానికి హాజరయ్యారు. దీంతో కొంత సేపు హైడ్రామా నడిచింది. టీడీపీ కౌన్సిలర్ సత్యానందాన్ని సస్పెండ్ చేసిన విషయం తెలుసుకున్న ఆయన ఈ విషయాన్ని మరోసారి పరిశీలించాలని చైర్మన్‌కు సూచించారు. మిగిలిన కౌన్సిలర్లుతో మాట్లాడి చెప్తానని.. సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో కౌన్సిలర్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వెళ్లిపోయారు.
ఐదేళ్లలో రెండుసార్లు సస్పెన్షన్ వేటు
చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా చైర్మన్ పదవికి గౌరవం ఇవ్వాలి. అలా కాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ అగౌరవపరచేలా చైర్మన్‌ను, ఆ కుర్చీని కించపరిచేలా టీడీపీ కౌన్సిలర్ సత్యానందం వ్యవహరించారు. 2022 ఏప్రిల్ నెలలో జరిగిన కౌన్సిల్ సమావేశంలోనూ చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి సభకు ఆటంకపరచేలా మాట్లాడినందుకు ఆయనతో పాటు మరో కౌన్సిలర్‌ను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. మరలా శుక్రవారం జరిగిన సభలో కూడా చైర్మన్ అగౌరవపరచేలా మాట్లాడినందుకు గాను మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు. ఐదేళ్ల పదవీకాలంలో సత్యానందం రెండు సార్లు సస్పెండ్ కావడం విశేషం.
మున్సిపల్ కౌన్సిల్ సభను అవమానించిన ప్రజాప్రతినిధి టీడీపీ కౌన్సిలర్ సత్యానందం క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల డిమాండ్ మూడు నెలలు సస్పెండ్ చేసిన చైర్మన్ వాడీవేడిగా మున్సిపల్ సమావేశం
Comments
Please login to add a commentAdd a comment