జగనన్న పాలన సువర్ణయుగం
నరసరావుపేట రూరల్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని, అదో సువర్ణ పాలన అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. కోటప్పకొండ యోగివేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, రెడ్ల సత్రంలో రెడ్డి సంఘీయుల కార్తిక వనసమారాధన ఆదివారం నిర్వహించారు. రెడ్డి సంఘీయులు పెద్ద సంఖ్యలో వన సమారాధనకు హజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిది శ్యామల ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడుతూ రాజ్యాధికారం దిశగా మరోసారి అడుగులు వేయడానికి నాయకులు, కార్యకర్తలు మనస్పర్థలు పక్కనపెట్టి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ నాలుగు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకత బయటకు రాకుండా ఉండేందుకే సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ల మీద కేసులు పెడుతున్నారని విమర్శించారు. పౌరుషాల గడ్డ పల్నాడులో వైఎస్సార్ సీపీ జెండాను ఎగురవేసేందుకు అందరూ కలిసిరావాలని కోరారు. ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. వైఎస్సార్ పేదలకు ఏ విధంగా అండగా ఉన్నారో అదే విధంగా జగనన్న అన్ని వర్గాలకు మేలు చేసేలా పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ ప్రజల మద్దతుతో కాకుండా ఈవీఎంలపై అధారపడి కూటమి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ధర్మవరంలో కేతిరెడ్డి ఓటమి దీనికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా నిలవాలని, అందరం కలిసి పోరాటాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఒక సామాజికవర్గం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం క్షక్ష సాధింపునకు పాల్పడుతోందన్నారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల కాలంలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదని, దీనిపై ప్రజాపోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. అక్రమ కేసులు పెట్టి మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని, తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, జగనన్నను వదిలేది లేదని స్పష్టంచేశారు. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామల మాట్లాడుతూ ప్రజాసంక్షమమే లక్ష్యంగా వైఎస్సార్ పాలన సాగించారని, ఆయనన ఆశయాలను, ఆలోచనలను మాజీ సీఎం జగన్ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. పోలవరం నుంచి గ్యాస్ వరకు ఒక్క హామీని కూడా కూటమి ప్రభుత్వం ఆరు నెలల కాలంలో అమలు చేయలేదని విమర్శించారు. మహిళలకు, బాలికలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందన్నారు. జగనన్న అనే ఒక ధైర్యం, ఒక నమ్మకం అని, జగనన్న తిరిగి సీఎం కావాలని రాష్ట్రమంతా ఎదురుచూస్తోందన్నారు. కార్యక్రమంలో సత్రం కమిటీ గౌరవ అధ్యక్షుడు భవనం రాఘవరెడ్డి, అధ్యక్షుడు కంజుల వీరారెడ్డి, కార్యదర్శి పొలిమేర వెంకటరెడ్డి, కోశాధికారి మాగులూరి సుబ్బారెడ్డి, వనభోజన కమిటి అధ్యక్షుడు సానికొమ్ము సుబ్బారెడ్డి, కార్యదర్శి గెల్లి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కోటప్పకొండలో రెడ్డి సంఘీయుల కార్తిక వనసమారాధన పాల్గొన్న ఎమ్మెల్యే బూచేపల్లి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ప్రకాశం జెడ్పీ చైర్‌పర్సన్ వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి శ్యామల పెద్ద సంఖ్యలో హాజరైన సంఘీయులు
Comments
Please login to add a commentAdd a comment