అధ్యయన కేంద్ర నిర్వాహకుడిపై చర్యలు
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న పరీక్షలు రాయనీయకుండా బాపట్ల జిల్లాలోని ఒక అధ్యయన కేంద్రం నిర్వాహకుడు అక్కడి విద్యార్థులను అడ్డుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆదివారం దూర విద్యా కేంద్రం పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య డి. రామచంద్రన్ తెలిపారు. దీనిపై విచారణ జరిపి ఆ స్టడీ సెంటర్ నిర్వాహకునిపై చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కూడా ఆ అధ్యయన కేంద్రంపై అనేక ఆరోపణలు రావడంతో అక్కడ పరీక్షా కేంద్రాన్ని రద్దుచేసి వేరే కళాశాలలో నిర్వహణకు నిర్ణయించామన్నారు. సుమారు 250మంది విద్యార్థులు ఆ కేంద్రంలో పరీక్షలు రాయాల్సి ఉండగా, ఐదుగురు మాత్రమే హాజరవుతున్నారని తెలిపారు. ప్రస్తుతం పరీక్షలకు హాజరు కావద్దని, వచ్చే సంవత్సరం తమకు పరీక్షా కేంద్రం అనుమతి వస్తుందని, అప్పుడు అందరికీ అనుకూలంగా పరీక్షలు రాయిస్తానని విద్యార్థులను పక్కదోవ పట్టిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు విద్యార్థులకు మెసేజ్‌లు పంపుతున్నట్లు ఫిర్యాదుల్లో తెలిపారు. వీటిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అసత్య వార్తలు వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు..
ఏలూరు దగ్గర్లోని కుక్కునూరు దూరవిద్య కేంద్రంలో పరీక్షల నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని వెలువడిన వార్తా కథనాలలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన వెల్లడించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో పరిశీలకుడు అక్కడే ఉంటున్నారని, పరీక్షల నిర్వహణ సజావుగా సాగుతోందని చెప్పారు. పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన స్క్వాడ్ ఈ మేరకు ధ్రువీకరించిందన్నారు. సమాధాన పత్రాలను భద్రపరచడానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక నోడల్ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేసినట్లు రామచంద్రన్ తెలిపారు. ఇదే అంశంపై కుక్కునూరు పోలీస్ స్టేషన్ సీఐ రమేష్‌కుమార్ వివరణ కూడా ఇచ్చారన్నారు. ఏఎన్‌యూ దూర విద్యాకేంద్రం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని, దీనిపై త్వరలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఏఎన్‌యూ దూర విద్యా కేంద్రం పరీక్షల కో–ఆర్డినేటర్
Comments
Please login to add a commentAdd a comment