రేపు సాహిత్య విమర్శ పురస్కారాలు ప్రదానం
నగరంపాలెం: సీహెచ్ లక్ష్మీనారాయణ స్మారక సాహిత్య విమర్శ పురస్కారాల ప్రదాన సభను ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు డాక్టర్ సీహెచ్ సుశీలమ్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు బృందావన్‌గార్డెన్‌న్స్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి వారి దేవస్థానం ఆవరణలో ఉన్న అన్నమయ్య కళావేదికపై కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు హాజరవుతారని చెప్పారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్, ప్రముఖ రచయిత విమర్శకులు, డాక్టర్ జీఎస్ చలంకు పురస్కారాలు అందజేస్తామని తెలిపారు.
ఐఎంఏ రాష్ట్ర ఉత్తమ కార్యదర్శిగా డాక్టర్ బూసిరెడ్డి
గుంటూరు మెడికల్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర ఉత్తమ కార్యదర్శిగా సీనియర్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్, సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్ర రెడ్డి అవార్డు అందుకున్నారు. 2023–24 సంవత్సరానికిగాను గుంటూరు బ్రాంచ్‌ను అన్ని విభాగాలలో ఉత్తమ పనితీరు కనపరిచేలా తీర్చిదిద్దినందుకు డాక్టర్ బూసిరెడ్డికి ఈ అవార్డు దక్కింది. గుంటూరు మెడికల్ కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో ఐఎంఏ రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. అసోసియేషన్ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఆర్‌వీ అశోకన్, డాక్టర్ అనిల్ కుమార్ జే నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గార్లపాటి నందకిషోర్‌ల చేతుల మీదుగా డాక్టర్ బూసిరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఉత్తమ కార్యదర్శితోపాటు గుంటూరు బ్రాంచ్‌కు ఉత్తమ సేవా విభాగం, విపత్కర పరిస్థితుల్లో ఉన్నవారికి ఆపన్న హస్తం (ఫ్లడ్ రిలీఫ్) అందించినందుకు రెండు పతకాలు లభించాయి. ఐఎంఏ రాష్ట్ర నేతలు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా డాక్టర్ బూసిరెడ్డి అనేక కార్యక్రమాలను చేపట్టి గుంటూరు బ్రాంచ్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారని అభినందించారు.
రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్ మీట్‌కు 120 మంది
గుంటూరు వెస్ట్(క్రీడలు): రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పోటీలు ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరిగాయి. రాష్ట్ర అధక్షుడు లాల్ వజీర్ మాట్లాడుతూ.. మొత్తం ఈ పోటీల్లో 200 మంది పాల్గొన్నారన్నారు. వీరిలో 120 మంది రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్ర పోటీలు ఈ నెల 28, 29 తేదీల్లో ఎన్టీఆర్ స్టేడియంలోనే నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ నజీర్, కోటేశ్వరరావు, లక్ష్మి, నవమి, ఫ్లోరా, రామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment