బైపాస్ రోడ్డుకు ముగిసిన మార్కింగ్ ప్రక్రియ
● ఐదు గ్రామాల్లో 17 కిలోమీటర్ల మేర మార్కింగ్ ● భూములు కోల్పోతున్న రైతుల వివరాల నమోదు
నరసరావుపేట రూరల్: బైపాస్ రోడ్డు ఏర్పాటుకు మార్కింగ్ ప్రక్రియ బుధవారం ముగిసింది. మంగళవారం రావిపాడు నుంచి మార్కింగ్ ప్రారంభించి, సాయంత్రానికి జొన్నలగడ్డ వరకు పూర్తి చేశారు. రావిపాడులో ఒక కిలోమీటరు, గుంటగార్లపాడులో కొంత మేర శాటిలైట్ సిగ్నల్ అందక ప్రక్రియ నిలిచిపోయింది. బుధవారం మూడు బృందాలు సర్వేలో పాల్గొన్నాయి. జొన్నలగడ్డ నుంచి కేసానుపల్లి వరకు దాదాపు 7 కిలోమీటర్ల మేర మార్కింగ్ చేశారు. అలాగే మంగళవారం శాటిలైట్ సిగ్నల్ కారణంగా నిలిచిపోయిన రావిపాడులో కొంతభాగం, గుంటగార్లపాడులో కూడా మార్కింగ్‌ను పూర్తి చేశారు. దీంతో కేసానుపల్లి, జొన్నలగడ్డ, నరసరావుపేట, ఇస్సప్పాలెం, గుంటగార్లపాడు, రావిపాడు రెవెన్యూ గ్రామాల పరిధిలోని 17 కిలోమీటర్ల మార్కింగ్ పూర్తి చేసినట్టయింది. గతంలో హైవే అథారిటీ చేసిన సర్వేలో రహదారి నిర్మాణానికి 60 మీటర్ల మేర భూమిని సేకరించాలని నిర్ణయించి మార్కింగ్ ఇచ్చారు. తాజాగా చేస్తున్న సర్వేలో 45 మీటర్లకు కుదించి మార్కింగ్ చేస్తున్నట్టు సమాచారం. విలువైన భూములను ఇచ్చేందుకు రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మార్కింగ్ చేస్తున్న సమయంలో హద్దురాళ్లును హైవే అథారిటీ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. మార్కింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో భూ సేకరణపై రెవెన్యూ శాఖ దృష్టి పెట్టారు. భూములు కోల్పోతున్న రైతుల వివరాలను సేకరించనున్నారు. ఈ మేరకు వీఆర్‌వోలు, గ్రామ సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు నమోదు చేయనున్నారు. వారం రోజుల్లో రైతుల సంఖ్య, పూర్తి విస్తీర్ణం వివరాలు తెలుస్తాయని తహసీల్దార్ వేణుగోపాలరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment