కోటప్పకొండ తిరునాళ్లకు పటిష్ట ఏర్పాట్లు
నరసరావుపేట రూరల్: లక్షలాదిగా భక్తులు తరలివచ్చే కోటప్పకొండ తిరునాళ్లకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 26వ తేదీన కోటప్పకొండలో నిర్వహించనున్న తిరునాళ్ల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో బుధవారం త్రికోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శాఖలవారీగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తాగునీరు, రవాణా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. తగినంత సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు. నడక మార్గంలో టెంట్లు, గ్రీన్ మ్యాట్లు ఏర్పాటుకు ఆదేశించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని చెప్పారు. యూటీ వద్ద ప్రభలు హైటెన్షన్ వైర్లు దాటే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఘాట్‌రోడ్డులో అనువైన బస్సులనే నడపాలని సూచించారు. భక్తులకు ఈ మార్గంలో అనుమతి లేదని, మెట్ల మార్గం ద్వారానే కొండమీదకు చేరుకోవాలని తెలిపారు. చిన్నారులు తప్పిపోకుండా ట్యాగ్లు వేయాలని సూచించారు. కొండ దిగువన, ఆలయ ప్రాంగణంలో రెండు కంట్రోల్ రూమ్‌లను శాఖల సమన్వయం కోసం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దేవదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామి దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఉచిత, శీఘ్ర, వీఐపీ, అభిషేక దర్శనాలకు ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయని చెప్పారు. పలు చోట్ల నుంచి 528 బస్సులను నడుపనున్నారు. 2.75 లక్షల వాటర్ ప్యాకెట్లు, 140 తాత్కాలిక మరుగుదొడ్లను అందుబాటులో ఉంచనున్నారు. 500 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు అందిస్తారని డీఈవో చంద్రకళ చెప్పారు. కొండకు చేరుకునే 13 రహదారుల్లో మరమ్మతులు, పిచ్చి మొక్కల తొలగింపు చేపట్టనున్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఎఫ్‌వో కృష్ణప్రియ, ఆర్డీవో మాధవీలత, జెడ్పీ సీఈవో జ్యోతిబసు, ఆలయ ట్రస్టీ రామకృష్ణ కొండలరావు, ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment