
మసకబారింది!
మూడో కన్ను
నకరికల్లు: 2023 జూలైలో స్థానిక ఇందిరమ్మకాలనీలోని ఒక ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.7లక్షల నగదు, కొంత బంగారం చోరీకి గురైంది. చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు వారంరోజుల్లోనే కేసును ఛేదించగలిగారు. సొత్తును రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.
– అదే ఏడాది ఆగస్టులో హైవే పక్కన ఉన్న ఏటీఎం ధ్వంసం చేసిన ఘటనలోను నిందితుడిని ఒక్కరోజులోనే పట్టుకోగలిగారు. అంత త్వరగా కేసులు ఛేదించడానికి పోలీసులకు ఉపయోగం పడిన ఆయుధం సీసీ కెమెరా.. ఇలా ఎన్నో కేసులను అతితక్కువ సమయంలో పోలీసులు ఛేదించగలిగారంటే అది కేవలం సీసీ కెమెరాలు అందించిన ఆధారాలే. 2023లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో 2023 సంవత్సరంలో నకరికల్లు గ్రామంలోని ప్రధాన కూడళ్లలో, అలాగే అద్దంకి–నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారి పక్కన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రూ.4 లక్షలు వెచ్చించి 28 పెద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా పోలీస్ కంట్రోల్ రూంలో రికార్డయి తెలిసిపోయేది. చోరీలు అరికట్టేందుకు, చోరీ కేసుల్లోని, రోడ్డు ప్రమాదాల్లో నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషించాయి. సీసీ కెమెరాలు ఇచ్చిన క్లూ ఆధారంగా ప్రమాదానికి కారణమై తప్పించుకుపోయిన నిందితులను వాహనాలతో సహా గుర్తించారు. ఇలాంటి ఎన్నో ఘటనలకు కారణమైన ఆధారాలను అందించిన సీసీ కెమెరాలు గత కొన్నిరోజులుగా ఏ ఒక్కటీ పనిచేయడం లేదు. దీంతో గ్రామస్తులు మళ్లీ భయం నీడన బతకాల్సి వస్తుంది.
సాంకేతిక లోపాలు సరిచేయిస్తున్నాం
సీసీ కెమెరాల నిర్వహణలో చిన్న చిన్న సాంకేతిక లోపాలు తలెత్తాయి. టెక్నీషియన్‌ల సహాయంతో లోపాలను గుర్తించి మరమ్మతులు చేయించి సత్వరమే వినియోగంలోకి తీసుకువస్తాం. శాంతిభధ్రతలకు అన్నివిధాల టెక్నికల్‌గా చర్యలు తీసుకుంటాం.
– చల్లా సురేష్, ఎస్‌ఐ, నకరికల్లు
ఒక్కటీ పని చేయడం లేదు..
సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో మళ్లీ ఇటీవల కాలంలో ఘర్షణలు, చోరీలు జరుగుతున్నాయని రోడ్డుపక్కన గృహాల వారు, శివారు ప్రాంతంలో నివాసముంటున్న వారు, దుకాణదారులు వాపోతున్నారు. వేసవి కావడంతో ఎక్కువగా దొంగతనాలు జరుగుతుంటాయి. అందునా సెలవుల కాలంలో ఇళ్లకు తాళాలు వేసి కుటుంబసమేతంగా ప్రజలు ఊళ్లకు, యాత్రలకు వెళ్తుంటారు. ఈ నేపధ్యంలో ఆస్తుల భధ్రత ప్రశ్నార్ధకంగా మారింది. అందునా అద్దంకి – నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారి పక్కన గ్రామం కావడంతో చోరీలతో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో జరిగిన చోరీల నేపధ్యంలో సీసీకె మెరాలు పనిచేయడం లేదన్న సమాచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మరమ్మతుకు గురైన సీసీ కెమెరాలు సత్వరమే వినియోగం తేవాలని ప్రజలు కోరుతున్నారు.
నకరికల్లులో మొరాయించిన సీసీ కెమెరాలు 2023లో రూ.4 లక్షలు వెచ్చించి 28 కెమెరాలు ఏర్పాటు ఫుటేజీ సాయంతో ఎన్నో కేసులు సత్వరమే ఛేదించిన పోలీసులు గత కొన్నిరోజులుగా ఏ ఒక్కటీ పనిచేయని వైనం ప్రశ్నార్థకంగా మారిన ప్రజాభద్రత

మసకబారింది!