మారుమూల గ్రామ రైతు కొడుకు 'శాస్త్రవేత్తగా'.. | Sakshi
Sakshi News home page

మారుమూల గ్రామ రైతు కొడుకు 'శాస్త్రవేత్తగా'..

Published Mon, Dec 25 2023 12:46 AM

తల్లిదండ్రులతో ఆనంద్‌ - Sakshi

భద్రాద్రి: ఓ రైతు కొడుకు పారిశ్రామిక మంత్రిత్వ శాఖకు అనుసంధానంగా ఉండే బెంగళూరులోని సెంట్రల్‌ మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌(సీఎంటీఐ)లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. మండలంలోని సీతంపేట గ్రామ పంచాయతీ పరిధి రెడ్డిపాలెం గ్రామానికి చెందిన లావుడ్యా ఆనంద్‌ ఈ ఘనత సాధించాడు. ఆనంద్‌ తల్లిద్రండులు లావుడ్యా ఈర్య, మంగ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం ఉండగా పెద్ద కుమారుడు ఆనంద్‌ శాస్త్రవేత్తగా ఎంపికై పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు. మారుమూల గ్రామం నుంచి ఓ యువకుడు శాస్త్రవేత్తగా ఎంపికైన నేపథ్యంలో గ్రామస్తులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికంగా విద్యాభ్యాసం..
గ్రామానికి చెందిన ఈర్యా, మంగ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు ఆనంద్‌ ఒకటి నుంచి 5 వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, 6 నుంచి 10 వరకు సుజాతనగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదివాడు. కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశాడు. చైన్నెలో బీఈ (ఈఈఈ) పూర్తి చేశాడు. ఆ తర్వాత ఏడాది పాటు హైదరాబాద్‌లో గేట్‌ కోచింగ్‌ తీసుకొని ఆంధ్రా యూనివర్సిటీలో ఎంటెక్‌ (కంట్రోల్‌ సిస్టమ్స్‌ విభాగం)లో సీటు సంపాధించాడు. ఎంటెక్‌ పూర్తయిన అనంతరం 2019 నుంచి 2021 వరకు కరోనా ప్రభావంతో విద్యాభ్యాసానికి కొంచెం బ్రేక్‌ పడింది.

రాజీ లేకుండా శ్రమించి..
కరోనా సమయంలో దొరికిన విరామాన్ని ఆనంద్‌ వృథాగా వదిలేయకుండా శ్రమించాడు. వివిధ కొలువుల రాత పరీక్షల మూలంగా తొలిసారిగా బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెట్‌ (బీఈఎల్‌)లో ట్రెయినీ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాడు. నెల పాటు ఇక్కడ ట్రెయినీ ఇంజనీర్‌గా పనిచేసిన అనంతరం హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ – రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌లో ‘రీసెర్చ్‌ ఫెలో’గా ఉద్యోగం సాధించాడు. అనంతరం సీఎంటీఐలో శాస్త్రవేత్త కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని అతను రాత పరీక్ష, మౌఖిక పరీక్షకు హాజరయ్యాడు. సీఎంటీఐలో శాస్త్రవేత్తగా ఎంపికై నట్లు అపాయిమెంట్‌ లెటర్‌ రావడంతో తన కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు.

ఇవి చ‌ద‌వండి: తాను చనిపోతూ.. ఆరుగురికి పునర్జన్మ

Advertisement
Advertisement