న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం అదానీ గ్రూప్ భారీ లాభాలపై గురి పెట్టింది. రానున్న రెండు, మూడేళ్లలో రూ. 90,000 కోట్ల నిర్వహణ లాభాల(ఇబిటా)ను అందుకోవాలని ఆశిస్తోంది. ఇందుకు విమానాశ్రయాలుసహా.. సిమెంట్, పునరుత్పాదక ఇంధనం తదితర పలు బిజినెస్‌లను పటిష్ట వృద్ధి బాటలో నిలపాలని ప్రణాళికలు వేస్తున్నట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. గ్రూప్ నిర్వహణలోగల పోర్టులు, రవాణా, లాజిస్టిక్స్, విద్యుత్ ప్రసారం, సోలార్ ప్యానెళ్లు తదితర విభాగాలను పరుగు తీయించే యోచనలో ఉంది.
ఈ బాటలో గ్రూప్ చేపడుతున్న మౌలిక సదుపాయాల కొత్త పెట్టుబడులు రానున్న కాలంలో నగదును సృష్టించగలదని అంచనా వేస్తోంది. యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ ఈ నెల మొదట్లో 2.65 బిలియన్ డాలర్ల విలువైన రుణాలను తిరిగి చెల్లించిన సంగతి తెలిసిందే. తద్వారా ఇన్వెస్టర్లలో గ్రూప్‌పట్ల నమ్మకం మరింత బలపడేందుకు వీలు కలిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
20 శాతం వృద్ధి బాటలో
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఇబిటాలో 20 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అదానీ గ్రూప్ తాజాగా పేర్కొంది. దీంతో రెండు, మూడేళ్లలో రూ. 90,000 కోట్ల ఇబిటాకు చేరుకోవాలని చూస్తున్నట్లు తెలియజేసింది. మార్చితో ముగిసిన గతేడాది(2022–23)కి గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల ఇబిటా ఉమ్మడిగా 36 శాతం జంప్‌చేసి రూ. 57,219 కోట్లను తాకింది. గ్రూప్‌లో 83 శాతం వాటా కలిగిన మౌలిక సదుపాయాల కీలక బిజినెస్‌లు వార్షికంగా 23 శాతం పురోగతిని సాధించాయి. ఇంధనం, రవాణా, లాజిస్టిక్స్‌తోపాటు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కుగల ఇన్‌ఫ్రా వెంచర్లతో కూడిన విభాగాలు ఉమ్మడిగా రూ. 47,386 కోట్ల ఇబిటాను అందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment