ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లు వాడుతున్నారా..? ఒకటి కంటే ఎక్కువ యూపీఐ యాప్‌లు వినియోగిస్తున్నారా..? అయితే మీకో ముఖ్యమైన సమాచారం. కొన్ని యూపీఐ ఐడీలు డిసెంబర్ 31 నుంచి పనిచేయవు. అవేంటి.. ఎందుకు పనిచేయవు.. ఇక్కడ తెలుసుకోండి..
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆన్‌లైన్ పేమెంట్స్ విస్తృతమయ్యాయి. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపుగా ప్రతిఒక్కరూ ఈ యాప్‌లను ఉపయోగించే చెల్లింపులు చేస్తున్నారు. చిరు దుకాణాల దగ్గర నుంచి ఆన్‌లైన్ షాపింగ్ వరకూ యూపీఐ చెల్లింపులే అత్యధికం ఉంటున్నాయి.
ప్రస్తుతం ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటివాటితోపాటు ఇంకా మరికొన్ని యూపీఐ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆయా యాప్‌లు రకరకాల ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు వంటివి అందిస్తున్నాయి. దీంతో చాలా మంది వివిధ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుని కొద్దికాలం వినియోగించి మళ్లీ వాటి గురించి మరిచిపోతున్నారు. ఇలా 2023 డిసెంబర్ 31 నాటికి ఒక సంవత్సరం పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉన్న యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయాలని ఆయా యాప్‌లను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) కోరింది.
కారణం ఇదే..
బ్యాంక్ అకౌంట్‌లకు లింక్ చేసిన ఫోన్ నంబర్‌లను డీలింక్ చేయకుండా కస్టమర్‌లు ఫోన్ నంబర్‌లను మార్చినప్పుడు పాత నంబర్‌ల ద్వారా లావాదేవీలు జరగకుండా చూడటమే ఇన్‌యాక్టివ్ యూపీఐ ఐడీల డీయాక్టివేషన్ లక్ష్యమని తెలుస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్గదర్శకాల ప్రకారం, 90 రోజుల వ్యవధి ముగిసిన తర్వాత కొత్త సబ్‌స్క్రైబర్‌లకు టెల్కోలు డియాక్టివేటెడ్ నంబర్‌లను జారీ చేస్తుంటాయి.
బ్యాంక్‌తో లింక్ చేసిన పాత మొబైల్ నంబర్‌ను కస్టమర్ అప్‌డేట్ చేసుకోకపోతే దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు 2023 డిసెంబర్ 31 లోపు ఈ విషయంపై తగిన చర్య తీసుకోవాలని ఎన్‌పీసీఐ కోరినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment