
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మళ్లీ బ్రేక్‌లు పడ్డాయి. బుకింగ్స్‌ను పునఃప్రారంభించిన 48 గంటల్లోనే కంపెనీ మళ్లీ నిలిపివేత
ముంబై: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మళ్లీ బ్రేక్‌లు పడ్డాయి. బుకింగ్స్‌ను పునఃప్రారంభించిన 48 గంటల్లోనే కంపెనీ మళ్లీ నిలిపివేసింది. సప్లయి చెయిన్‌లో అనిశ్చితే ఇందుకు కారణమని తెలిపింది. తదుపరి బుకింగ్ రౌండ్ ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. బజాజ్ కంపెనీ చేతక్ ఈ-స్కూటర్స్ బుకింగ్స్‌ను ఈ నెల 13న ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన ఆన్‌లైన్‌లో రీ-ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత బెంగళూరు, పుణే నగరాల్లో మాత్రమే బుకింగ్స్‌కు అవకాశం కల్పించింది. కస్టమర్ల నుంచి అధిక స్పందన లభించిందని.. గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో విపరీతమైన అంతరాయాలు, సుదీర్ఘ నిరీక్షణ కాలం ఉన్నప్పటికీ బుకింగ్స్‌ను చాలా తక్కువ రద్దు చేశామని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు.
ఇప్పటికే బుకింగ్స్ తీసుకున్న కస్టమర్లు త్వరగా డెలివరీలను స్వీకరించి, రైడింగ్‌ను ఆస్వాదించాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. సరఫరా గొలుసు సమస్యలను పరిష్కరించి.. వీలైనంత త్వరగా బుకింగ్స్‌ను రీ–ఓపెన్ చేస్తామని.. వచ్చే త్రైమాసికంలో మరిన్ని నగరాలలో కూడా బుకింగ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. చేతక్‌లో అర్బన్, ప్రీమియం రెండు మోడల్స్ ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే.. ప్రత్యేకమైన యాప్‌కు కనెక్ట్ చేయబడిన ఈ–స్కూటర్లకు ప్రమాదం జరిగినా లేదా దొంగిలించబడినా సరే సంబంధిత స్కూటర్ యజమానికి నోటిఫికేషన్స్ వెళతాయి. ధరలు అర్బన్ రూ.1.22 లక్షలు, ప్రీమియం రూ.1.26 లక్షలు(పుణే ఎక్స్‌షోరూమ్)గా ఉన్నాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 80 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది.