న్యూఢిల్లీ: భారత్ చేపట్టిన చరిత్రాత్మక సంస్కరణల ఫలాలతో 2014 నాటికి అంతర్జాతీయంగా 10వ స్థానంలో ఉన్న భారత్, ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు బ్రోకరేజీ సంస్థ బెర్న్‌స్టీన్ తెలిపింది. జీఎస్‌టీ, మౌలిక సదుపాయాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించడాన్ని ప్రస్తావించింది. ఈ మేరకు భారత్ ఆర్థిక వ్యవస్థపై బెర్న్‌స్టీన్ ఓ నివేదికను సోమవారం విడుదల చేసింది. ప్రధాని మోదీ సారథ్యంలో దశాబ్దం అంటూ టైటిల్ పెట్టింది. ద్రవ్యోల్బణం కట్టడి, అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం, డిజిటైజేషన్, కరోనా సమయంలో తీసుకున్న వివేకవంతమైన చర్యలు, చమురు ధరలు నియంత్రణలో ఉండడం సానుకూలించినట్టు పేర్కొంది.
‘‘కొందరికి అదృష్టం రాత్రికి రాత్రే వరిస్తుంది. కానీ, చాలా మందికి ఎన్నో ఏళ్ల కృషితోనే ఇది సాధ్యపడుతుంది. భారత్ స్టోరీ ఇలాంటిదే. బలమైన పునాది నిర్మాణానికి దశాబ్దానికి పైనే సమయం పట్టినప్పటికీ మరింత నమ్మకమైనదిగా భారత్ ఆర్థిక వ్యవస్థ అవతరించింది’’ అని ప్రశంసించింది.
కొన్ని విభాగాల్లో గొప్ప ఫలితాలు
మోదీ నాయకత్వంలో భారత్ కొన్ని విభాగాల్లో అద్భుతమైన పురోగతి సాధించినట్టు బెర్న్‌స్టీన్ నివేదిక తెలిపింది. డిజిటైజేషన్, ఆర్థిక వ్యవస్థను సంఘటితంగా మార్చడం, తయారీ రంగంలోకి పెట్టుబడులు ఆకర్షించేందుకు మెరుగైన విధాన వాతావరణం, మౌలిక రంగంపై వ్యయాలను పెంచడాన్ని ప్రస్తావించింది. గడిచిన దశాబ్ద కాలంలో ఆర్థిక వృద్ధి స్తబ్దుగా ఉన్నప్పటికీ, బలమైన పునాదులు పడ్డాయని, నూతన సంస్కరణలతో ఆర్థిక వ్యవస్థ బలపడినట్టు వివరించింది. సానుకూల వృద్ధి చక్రానికి అవసరమైన పునాదులు పడినట్టు చెబుతూ, ఇక్కడి నుంచి దిగువవైపు రిస్క్ లు చాలా పరిమితమని అభిప్రాయపడింది.
5.7 శాతం చొప్పున
‘‘భారత్ జీడీపీ 2014 నుంచి 5.7 శాతం వార్షిక కాంపౌండెడ్ వృద్ధిని చూసింది. కోవిడ్ కాలాన్ని మినహాయించి చూస్తే వృద్ధి 6.7 శాతంగా ఉంటుంది. యూపీఏ హయాంలో ఉన్న 7.6 శాతానికంటే కొంచెం తక్కువ. కాకపోతే అప్పట్లో బేస్ కనిష్టంగా ఉండడం వల్ల అంత వృద్ధి సాధ్యపడింది’’అని బెర్న్‌స్టీన్ తెలిపింది. తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన సంస్థలు, బలహీన ఆర్థిక వ్యవస్థ వారసత్వంగా మోదీ సర్కారుకు వచ్చినట్టు గుర్తు చేసింది. మోదీ హయాంలో భారత్ పదో స్థానం నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగా, తలసరి ఆదాయం విషయంలో 147వ ర్యాంకు నుంచి 127వ ర్యాంకుకు మెరుగుపడినట్టు ఈ నివేదిక తెలిపింది. వ్యాపార నిర్వహణ మరింత సులభతరంగా మారినట్టు పేర్కొంది. అంతకుముందు సర్కారు కాలంలో చేసిన తప్పులను సరిచేస్తూ, భారత్ మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేయడం మంచి ఫలితాలనిచ్చినట్టు విశ్లేషించిది.
డిజిటైజేషన్, అందరికీ ఆర్థిక సేవల విషయంలో భారత్ మంచి పురోగతి సాధించినట్టు తెలిపింది. బ్యాంక్ ఖాతాలు కలిగిన వ్యక్తులు 2011 నాటికి 35 శాతంగా ఉంటే, 2021 నాటికి 77 శాతానికి పెరిగారని, జన్‌ధన్ ఖాతాలే 50 కోట్లుగా ఉండడాన్ని ప్రస్తావించింది. ‘‘పలు పథకాల సబ్సిడీలకు ఆధార్‌ను వినియోగించడం ద్వారా మధ్యవర్తులు, జాప్యాన్ని సర్కారు నివారించింది. యూపీఐ ఎంతో ప్రగతి సాధించింది. ఓఎన్‌డీసీ ఏర్పాటుకు కావాల్సిన నమ్మకాన్ని కలిగించింది’’అని నివేదిక వెల్లడించింది.
వీటిల్లో మెరుగుపడాలి
భారత్ కొన్ని అంశాల్లో ఇంకా పురోగతి సాధించాల్సి ఉందని బెర్న్‌స్టీన్ నివేదిక అభిప్రాయపడింది. మానవాభివృద్ధి సూచీలో 2016 నుంచి క్షీణిస్తున్నట్టు పేర్కొంది. కరోనా కాలంలో పాఠశాల సమయం తగ్గిపోవడాన్ని ప్రస్తావించింది. మహిళా అక్షరాస్యత విషయంలో పెద్దగా మార్పు లేదని, అవినీతి నిర్మూలనలో ఇంకా మెరుగుపడాల్సి ఉందని పేర్కొంది. లింగనిష్పత్తి సెకండరీ స్కూల్ స్థాయిలో క్షీణించినట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment