..అవును, ఇళ్లు కదులుతాయి. ఉద్యోగ విరమణ చేశాక హాయిగా పొలం దున్నుతూ వ్యవసాయం చేయాలనో... ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడ చిన్న ఫాంహౌస్ నిర్మించుకోవాలనో... ప్రతిచోటా ఆఫీస్ పెట్టడం కుదరడం లేదనో...ఎక్కడికంటే అక్కడికి ఆఫీస్‌ను తరలించే సదుపాయం ఉంటే బాగుండనో అనుకుంటారు. ఇలా ఆలోచించే వారి కోసమే ఈ కంటైనర్ హోమ్‌లు. కొన్నిరోజులు లేదా నెలలు ఒకే ప్రదేశంలో ఉండి తర్వాత ఉంటున్న ఇంటిని వేరే చోటుకు మార్చాలనుకునేవారికి కంటైనర్‌హోమ్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
పెద్దగా నిర్మాణ వ్యయం లేకపోవడంతో 200 నుంచి 500 చదరపు అడుగుల్లోనే వీటిని నిర్మించుకునే అవకాశం ఉండటంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. ఎండా, వానల నుంచి రక్షణనివ్వడంతో పాటు ఎక్కువ కాలం మన్నిక ఇచ్చేలా వీటిని తయారుచేస్తున్నారు. దాంతో వీటి కొనుగోళ్లు పెరుగుతున్నాయని తయారీదారులు చెబుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రెండురాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని ఫాంహౌస్‌లు, కాఫీషాపులు, టీస్టాళ్లు.. ఇలా ఎక్కడ చూసినా ఇవి తారసపడుతున్నాయి. ఓ చోట పని ముగియగానే అక్కడి నుంచి వీటిని తరలించే వెసులుబాటు ఉండటం వీటిలో ప్రత్యేకం. ఖర్చు కూడా చదరపు అడుగుకు రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉండటంతో చిన్నపాటి గూడును నిర్మించుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
తయారీ ఇలా..
కంటైనర్ హోమ్ అనగానే ప్రధానంగా ఇవి ఎన్ని రోజులు మన్నికగా ఉంటాయి. ఎండా, వానల నుంచి రక్షణ ఉంటుందా. పైకప్పు, ఫ్లోర్ తుప్పుపడతాయేమో..విద్యుదాఘాతం జరిగితే.. ఇలా అందరి మదిలో మెదిలే ప్రశ్నలు ప్రధానంగా ఉంటాయి. వీటికి స్పష్టమైన సమాధానాలున్నాయని తయారీదారులు హామీ ఇస్తుండటంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు. రెండు నుంచి మూడేళ్ల పాటు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తామని, అయితే నిర్వహణలో జాగ్రత్తలు తప్పనిసరని తయారీదారులు సూచిస్తున్నారు.
సౌకర్యాలు ఇలా..
- గాల్వనైజింగ్ స్టీల్, ఎండీఎఫ్ బోర్డులను వీటి తయారీకి ఉపయోగిస్తున్నారు.
- గ్రిడ్ వేస్తూ బైసన్ బోర్డుతో మూడు లేయర్లుగా ఫ్లోర్‌ను తీర్చిదిద్దుతున్నారు.
- నచ్చినవారు టైల్స్ వేసుకోవచ్చు.
- ఫ్లోర్ అంతా వాటర్‌ఫ్రూఫ్ మెటీరియల్ వేయడంతో నీటి వల్ల పాడైపోతుందనే సమస్య లేదు.
- అయితే నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తయారీదారులు సూచిస్తున్నారు.
- టీవీ యూనిట్, ఏసీ ఏర్పాటుకు అవసరమైన వ్యవస్థ, స్విచ్‌బోర్డులు, ఎల్‌ఈడీ బల్బులు అన్నింటినీ తయారీదారులే ఇవ్వడంతో కొనుగోలు చేసేవారికి కొంత ఉపశమనం కలిగినట్టే.
- విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు కోసం పకడ్బందీగా పవర్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
- షార్ట్‌సర్క్యూట్‌కి అవకాశం లేకుండా పైపులను అమర్చుతూ అందులోంచి వైర్లను పవర్ యూనిట్‌కు అనుసంధానిస్తున్నారు.
- పైన 50 ఎంఎం ఇన్సులేషన్ చేయడంతో షార్ట్‌సర్క్యూట్‌కి అవకాశం ఉండదు.
- నీటి ట్యాంక్ కోసం ప్రత్యేకమైన స్టాండ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
- 1000 నుంచి 1500 లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు.
- ఇలా 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో కంటైనర్ హోమ్‌లకు సుమారు రూ.2.5లక్షలు, వీటికి అదనంగా వాష్‌రూమ్, కిచెన్ అమర్చితే సుమారు రూ.3లక్షల వరకు ఖర్చవుతుందని చెబుతున్నారు.
- ఇంకా అదనపు హంగులు జోడిస్తే అనుగుణంగా ధరలున్నాయని చెబుతున్నారు.
- పై అంతస్తులు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని మరికొంత మంది చెబుతున్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రెంట్లు ఎంత పెరిగాయో తెలుసా..
ఖర్చు తక్కువ
ప్రస్తుత పరిస్థితుల్లో రెండు గదుల ఇంటి నిర్మాణం చేపట్టాలంటే కనీసం ఐదు లక్షల రూపాయలు కూడా సరిపోవడం లేదు. అదే కంటైనర్ హోమ్ అయితే ఐదు లక్షల రేంజ్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇంటినే సకల సౌకర్యాలతో నిర్మించుకునే వీలుంది. పైగా ఆర్డర్ చేసిన కొద్ది రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తయిపోతుంది. పైగా హాల్, కిచెన్, బెడ్‌రూమ్ ఇలా అన్ని సౌకర్యాలు ఉంటున్నాయి. దీంతో తక్కువ సమయంలో అందుబాటులోకి వచ్చే కంటైనర్ ఇళ్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతోందని రియల్టీ వర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment