ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని ఐటీ కంపెనీ సీఈవోను అపహరించిన ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు జూబ్లీహిల్స్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి.వెంకటగిరి తెలిపారు. నిందితుల నుంచి 84 ల్యాప్‌టాప్‌లు, 18 మొబైల్ ఫోన్లు, ఒక కారు, పాస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం..హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో రవిచంద్రరెడ్డి గిగ్‌లీజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటీ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడు వివిధ కన్సల్టెన్సీల ద్వారా రిక్రూట్ అయిన దాదాపు 1,200 మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయాడు. దాంతో ఉద్యోగులు, కన్సల్టెంట్లు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కంపెనీ సీఈఓ రవిచంద్రపై ప్రస్తుత ఉద్యోగులు, పలువురు మాజీ ఉద్యోగులు ఇటీవల రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రవి తమకు జీతాలు చెల్లించకుండా మోసం చేశాడని ఆరోపించారు. తాము రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల రూపాయలు వరకు చెల్లించి ఇతర కన్సల్టెన్సీల ద్వారా ఈ కంపెనీలో రిక్రూట్ అయ్యామని పేర్కొన్నారు. తమ జీతాల బకాయిలు అందకుండా తమను అన్యాయంగా ఉద్యోగంలో నుంచి తొలగించారని ఆరోపించారు.
ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న బిజినెస్ కన్సల్టెంట్ ఒకరు, ఇద్దరు సాఫ్ట్‌వేర్లు, మరో ఐదుగురు ఉద్యోగులు కలిసి రవిచంద్రను కిడ్నాప్ చేయాలనుకున్నారు. ముందుగా అనుకున్న విధంగానే జులై 10 అర్ధరాత్రి వీరు రవి నివాసంలోకి ప్రవేశించి కిడ్నాప్ చేశారు.
కిడ్నాప్ అయిన వెంటనే రవి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగే సమయంలో నిందితులు ఆమెపై దాడి చేశారని చెప్పారు. ఇంట్లో ఉన్న 84 ల్యాప్‌టాప్‌లను అపహరించినట్ల పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసు బృందం రవిచంద్రను శ్రీశైలం హైవేలోని ఓ హోటల్‌లో గుర్తించి రక్షించారు. నిందితులు దొంగలించిన 84 ల్యాప్‌టాప్‌లు, 18 మొబైల్ ఫోన్లు, ఒక కారు, మూడు పాస్‌పోర్ట్‌లతోపాటు వారికి చెందిన రెండు కార్లు, ఒక మోటర్‌బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ పి.వెంకటగిరి వివరించారు.
ఇదీ చదవండి: ప్లాట్‌ఫామ్ ఫీజు 20 శాతం పెంపు!
ఇదిలాఉండగా, ఉద్యోగం కోసం నైపుణ్యాలు పెంచుకుని నేరుగా కంపెనీలను ఆశ్రయించి ఇంటర్వ్యూలకు హాజరుకావాలని నిపుణులు చెబుతున్నారు. అంతేగానీ, దళారుల ద్వారా ఉద్యోగాల్లో చేరితే ఆర్థికంగా, ఉద్యోగపరంగా నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment