వర్ణ వివక్షకు కేరాఫ్ అయిన అగ్రరాజ్యంలో.. ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. మొట్టమొదటిసారి ఓ నల్ల జాతి మగువ ముఖచిత్రంతో అమెరికన్ కాయిన్ విడుదల చేశారు.
అమెరికన్ ఉమెన్ క్వార్టర్స్ ప్రోగ్రాంలో భాగంగా అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఆఫ్రో-అమెరికన్ రైటర్ మయా అంజెలు ముఖచిత్రంతో కాయిన్‌ను విడుదల చేశారు. ఏడేళ్ల వయసులో తల్లి ప్రియుడి చేతిలో అఘాయిత్యానికి గురై.. చావు దెబ్బలు తింది మయా అంజెలు. చివరికి బంధువుల చొరవతో ప్రాణాలతో బయటపడిన ఆ చిన్నారి.. ఆరేళ్లపాటు మూగదానిగా ఉండిపోయింది. ఆ చేదు అనుభవం నుంచి బయటపడేందుకు ఆ చిన్నవయసు నుంచే అక్షరాల్ని ఆశ్రయించింది.
కాలక్రమంలో ఆఫ్రో-అమెరికన్ రచయితగా, జాతి-వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలిగా మయా అంజెలుకు ఒక పేరు దక్కింది. ఉద్వేగంగా సాగే ఆమె రచనలు ప్రముఖులెందరినో ప్రభావితం చేశాయి కూడా. ఆమె ఆత్మకథ I Know Why the Caged Bird Sings ద్వారా ఎన్నో సమస్యల గురించి చర్చించారామె. 1993లో బిల్‌క్లింటన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా స్వయంగా కవిత వినిపించి.. ఆ అరుదైన గౌరవం అందుకున్న తొలి బ్లాక్ లేడీగా గౌరవం అందుకుంది. తన జీవిత కాలంలో 30కి పైగా అత్యున్నత డాక్టరేట్‌లు అందుకున్న మయా అంజెలు.. 2010లో అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా ‘స్వేచ్ఛా’ మెడల్‌ను సైతం స్వీకరించింది. 2014లో 86 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యంతో కన్నుమూసింది.
మయా అంజెలుతో పాటు చైనా సంతతికి చెందిన హాలీవుడ్ నటి అన్నా మే వాంగ్, అమెరికా తొలి మహిళా వ్యోమగామి సాలీ రైడ్ ముఖ చిత్రాల మీదుగా కూడా కాయిన్స్ రిలీజ్ చేసింది అమెరికా మింట్.
Comments
Please login to add a commentAdd a comment