Future Vs Amazon: Apex Court Asks For Fresh Decision On Merits And Set Aside Delhi High Court Order - Sakshi
Sakshi News home page

అమెజాన్‌తో న్యాయ పోరాటంలో ఫ్యూచర్‌కు ఊరట

Published Wed, Feb 2 2022 8:19 AM | Last Updated on Wed, Feb 2 2022 1:16 PM

Future vs Amazon: Apex Court asks for fresh decision on merits and set aside Delhi High Court Order - Sakshi

న్యూఢిల్లీ: అమెజాన్‌తో న్యాయ పోరాటం విషయంలో ఫ్యూచర్‌ గ్రూప్‌కు ఊరట కలిగించే కీలక ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం వెలువరించింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మూడు ఉత్తర్వులను చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ, ఏఎస్‌ బోమన్న,హిమా కోహ్లీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కొట్టివేస్తూ, తాజా తీర్పునకు కేసును రిమాండ్‌ బ్యాక్‌ (వెనక్కు పంపడం) చేసింది. వివరాలు క్లుప్తంగా...2020 ఆగస్టులో తమ రిటైల్‌ తదితర వ్యాపారాలను రిలయన్స్‌ రిటైల్‌కు విక్రయించేలా ఫ్యూచర్‌ గ్రూప్‌  రూ.24,713 ఒప్పందం ప్రకటించింది. అయితే దీన్ని అమెజాన్‌ వ్యతిరేకించింది. గత ఒప్పందాల ప్రకారం, ఫ్యూచర్‌ వ్యాపారాలను తనకే అమ్మాలని స్పష్టం చేసింది. అటుపైన సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. దీనిపై ఫ్యూచర్‌ గ్రూప్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.  ఈ కేసు సింగిల్, ద్విసభ్య ధర్మాసనాలు విచారించి తమ రూలింగ్స్‌ను ఇచ్చాయి. ఈ విషయంలో ప్రధానంగా  ఢిల్లీ హైకోర్టు నుంచి వేర్వేరు తేదీల్లో ఫ్యూచర్‌కు వ్యతిరేకంగా మూడు రూలింగ్స్‌ వచ్చాయి. 

మూడు ఉత్తర్వులు ఇవీ... 
రిలయన్స్‌తో విలీన ఒప్పందం విషయంలో యథాతథ పరిస్థితిని కొనసాగించాలని గత ఏడాది ఫిబ్రవరిలో ఫ్యూచర్‌ గ్రూప్‌నకు ఢిల్లీ హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశాలు అందులో మొదటిది. సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ అత్యవసర రూలింగ్‌ (ఈఏ)ను సమర్థిస్తూ, మార్చి 18న ఇచ్చిన ఉత్తర్వు మరొకటి. ఈఏ అవార్డును సమర్థిస్తూ, హైకోర్టు ఫ్యూచర్‌ గ్రూప్‌పై డైరెక్టర్లపై రూ.20 లక్షల జరిమానా విధించింది. డైరెక్టర్ల ఆస్తుల జప్తునకూ ఆదేశించింది. 2021 అక్టోబర్‌ 29న మరో రూలింగ్‌ ఇస్తూ,  సింగపూర్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఎమర్జెన్సీ అవార్డులో జోక్యం చేసుకోవడానికి, స్టే ఇవ్వడానికి నిరాకరించింది. వీటిపై ఫ్యూచర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం సోమవారం ఈ వివాదంతో తీర్పును వెలువరించింది.  ‘సమస్యను తిరిగి  పరిశీలించి, ఎటువంటి ఇతర ప్రభావం లేకుండా, స్వంత మెరిట్‌లపై ఆర్డర్‌ను జారీ చేయాలని మేము గౌరవ హైకోర్టు న్యాయమూర్తిని ఆదేశిస్తున్నాము. అలాగే కేసును త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచిస్తున్నాము’’ అని అత్యున్నత న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 

చదవండి: ఫ్యూచర్‌ వివాదంపై ఎన్‌సీఎల్‌ఏటీకి అమెజాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement