అఫ్గనిస్తాన్‌లో రాజ్యాధికారం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన తాలిబన్లకు గూగుల్ పెద్ద షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం అందించేందుకు విముఖత వ్యక్తం చేసింది. అంతేకాదు అకౌంట్లు, మెయిల్స్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు ప్రకటించిన గూగుల్.. మరోవైపు తాలిబన్ల నుంచి వస్తున్న విజ్ఞప్తులను తోసిపుచ్చుతోంది.
గత అఫ్గన్ ప్రభుత్వానికి సంబంధించిన ఈ-మెయిల్ అకౌంట్లను, మాజీ అధికారుల మెయిల్స్‌ను, అఫ్గన్ డిజిటల్ డేటా సర్వర్‌లను గూగుల్ తాతాల్కికంగా బ్లాక్ చేసింది. అయితే అది ఏ సంఖ్యలో అనేది గూగుల్ వెల్లడించలేదు(దాదాపు 24 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన సమాచారం ఉన్నట్లు అంచనా). ‘‘అఫ్గన్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, వాటిని అన్‌బ్లాక్ చేసే విషయంపై వేచిచేత ధోరణిని అవలంభించనున్నామ’’ని శుక్రవారం గూగుల్ మాతృక సంస్థ ఆల్ఫాబెట్ ఓ ప్రకటనలో విడుదల చేసింది. ఒకవేళ తాలిబన్లు పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పాటు చేసినా కూడా.. ఆ వివరాల్ని అందించే ఉద్దేశంలో గూగుల్ లేదని తెలుస్తోంది.
చంపేస్తారనే భయంతో..
తాలిబన్ల ఆక్రమణ తర్వాత ప్రభుత్వ అధికారులు, విదేశాలకు చెందిన ప్రతినిధులు అఫ్గన్ వ్యవస్థకు చెందిన కీలక సమాచారానికి(డాటా)ను వదిలేసి పారిపోయారు. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన వివరాల్ని వెల్లడించాలంటూ గూగుల్‌కు, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు మెయిల్స్ ద్వారా తాలిబన్ సంస్థ రిక్వెస్ట్ మెయిల్స్ పెడుతోంది. ఒకవేళ ఆ డాటా తాలిబన్ల చేతికి వెళ్తే పరిస్థితి ఏంటన్నది అంచనా వేయలేకపోతున్నారంతా. పైగా బయోమెట్రిక్ డేటా బేస్ ఆధారంగా చేసుకుని కొత్త ప్రభుత్వం(తాలినబ్ల నేతృత్వంలోని).. గతంలో తమకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లను, పని చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
గప్‌చుప్
కీలక సమాచారాన్ని తాలిబన్ల చేతికి వెళ్లనివ్వకుండా భద్రపరిచే విషయంలో గూగుల్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అయితే మైక్రోసాఫ్ట్ మాత్రం ఈ విషయంలో నోరు మెదపడం లేదు. మైకోసాఫ్ట్ ఈ మెయిల్స్ సర్వీస్ ద్వారానే గతంలో అఫ్గన్ అధ్యక్ష భవనం, విదేశాంగ శాఖ, అఫ్గన్ ఏజెన్సీలన్నీ కీలక సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకున్నాయి. ఈ తరుణంలో ఆ డాటా భద్రతపై మైక్రోసాఫ్ట్ ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. పైగా స్పందించేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది కూడా.
హాని తలపెట్టం: తాలిబన్లు
ప్రభుత్వ-ఆర్థిక సంబంధిత వ్యవహారాల కోసమే తాము డిజిటల్ డాటాను కోరుతున్నామని తాలిబన్లు చెప్తున్నారు. అమెరికాకు ఏజెంట్లుగా పని చేసిన అఫ్గన్ పౌరులను క్షమించి వదిలేస్తున్నామని ఇది వరకే ప్రకటించామని, అఫ్గన్ వ్యవస్థ సజావుగా నడవాలంటే పాత రికార్డులు తప్పనిసరిగా అవసరమని తాలిబన్లు చెప్తున్నారు. కానీ, ఈ విషయంలో తాలిబన్లను నమ్మే ప్రసక్తే లేదని అమెరికా అంటోంది. దురాక్రమణ టైంలో కీలక సమాచారానికి చెందిన సర్వర్స్‌ను తాలిబన్లు భద్రపరిచే ప్రయత్నాలు చేశారని, అఫ్గన్‌లో అమెరికా నిర్మించిన డిజిటల్ వ్యవస్థను ట్రేస్ చేసే ప్రయత్నామూ జరిగిందని అమెరికా నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి.
చదవండి: తాలిబన్లతో సంప్రదింపులు అవసరం
Comments
Please login to add a commentAdd a comment