సామాన్యులను అప్పుల ఊబిలోకి దింపి, వారిని పీడిస్తున్న అక్రమ రుణ యాప్‌ల ఆగడాలు పెరుగుతున్నాయి. గతంలోనే వాటి కట్టడికి కేంద్రం చర్యలు ప్రారంభించింది. భారతీయ రిజర్వు బ్యాంకు వద్ద నమోదైనవి మినహా ఇతర అనధికార రుణ యాప్‌లను యాప్ స్టోర్ల నుంచి తొలగించాలని ఎప్పుడో నిర్ణయించింది.
మొదట్లో చట్టబద్ధమైన ఆర్థిక సంస్థలు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలివ్వడం వల్ల డిజిటల్ రుణాల వైపు చాలామంది ఆకర్షితులవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఆ తరవాత మోసపూరిత రుణ యాప్‌లు రంగప్రవేశం చేసి అడిగిన వెంటనే రుణాలు ఇవ్వడం ప్రారంభిస్తున్నాయి. వాటి ప్రమాదాన్ని గుర్తించలేని కొందరు రుణ ఊబిలో కూరుకుపోతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా ఈ యాప్‌లకు సంబంధించి వివిధ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా యాడ్‌లు వస్తున్నాయి. దాంతో కొందరు అక్రమ రుణయాప్‌లను గుడ్డిగానమ్మి మోసపోతున్నారు.
తాజాగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు తమ ప్లాట్‌ఫామ్‌ల్లో నకిలీ రుణ యాప్‌లను ప్రచారం చేయకుండా కేంద్రం చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఇండియా ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం దేశంలో ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మోసపూరిత రుణ యాప్‌లను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. నకిలీ లోన్ యాప్‌ల ప్రకటనలను ప్రసారం చేయకుండా ప్రస్తుతం అమలులో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల్లో మార్పులు తీసుకురాబోతున్నట్లు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవల తెలిపారు. అయితే సామాజిక మాధ్యమాల్లో తమ ప్రకటనలు ప్రసారం చేసినందుకుగాను రుణయాప్‌లు కొంత డబ్బు ఆ కంపెనీలకు చెల్లిస్తాయి. నకిలీ రుణయాప్‌లకు సంబంధించి ప్రకటనలు వస్తున్నప్పుడు యూజర్ల ఇష్టానుసారంమేరకే వాటిని నిలిపేసేలా నిబంధనల్లో మార్పులు చేయనున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: వసూలు అవ్వకపోయినా.. తగ్గిన ‘పారుబాకీలు’! ఎలాగంటే..
‘ఆర్‌బీఐ వద్ద నమోదు చేసుకున్న రుణయాప్‌లు పరిమితంగా ఉండగా.. గుర్తింపు లేనివే అత్యధికంగా ఉన్నాయి. ఇవి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా భారీగా వడ్డీలను గుంజుతున్నాయి. రుణాన్ని తిరిగిచెల్లించినా చేయలేదని పేర్కొంటూ.. మరింత చెల్లించాలని నిర్వాహకులు ఒత్తిడి తెస్తున్నారు. ఇక చెల్లింపులు చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకుంటే దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతూ అవమానిస్తున్నారు. దీన్ని తట్టుకోలేక బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. లోన్‌యాప్‌ల దాష్టీకానికి రాష్ట్రంలో రెండేళ్లలో 10 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారు.’ అని ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment