తన ఖాతాదారులలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రుణదాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై ఇచ్చే వడ్డీ రేట్లను పెంచింది. ఖాతాదారుడి ఖాతాలో నిర్వహించే రోజువారీ బ్యాలెన్స్ మీద వడ్డీ లెక్కించనున్నట్లు బ్యాంకు తెలిపింది. అయితే, ఈ వడ్డీలను త్రైమాసిక ప్రాతిపదికన చెల్లించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పెంచిన కొత్త వడ్డీలు ఫిబ్రవరి 2, 2022 నుంచి అమలులోకి రానున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. రూ.50 లక్షల కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న పొదుపు ఖాతాలపై 3 శాతం వడ్డీరేటును అందిస్తుంది. ఖాతాలో రూ. 50 లక్షల నుంచి రూ.1,000 కోట్ల కంటే తక్కువ ఉన్న బ్యాలెన్స్ మీద బ్యాంక్ 3.50 శాతం వడ్డీని ఇస్తుంది. అదే సమయంలో, రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న మొత్తం మీద వడ్డీ రేటు 4.50 శాతం ఇవ్వనున్నట్లు తెలిపింది. సవరించిన రేట్లు దేశీయ, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ పొదుపు ఖాతాలకు వర్తిస్తాయని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ బ్యాంకుతో పాటు మరో రెండు బ్యాంకులు కూడా పొదుపు ఖాతాలపై విధించే వడ్డీరేట్లను సవరించాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్
మరోవైపు ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశీయ, ఎన్ఆర్ఐ పొదుపు ఖాతాలపై ఇచ్చే వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇంతకు ముందు, రూ.10 లక్షల కంటే తక్కువ సేవింగ్స్ గల ఖాతాలకు 2.80 శాతం వడ్డీరేటును ఇస్తే, ఈప్పుడు అది 2.75 శాతానికి తగ్గింది. రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్ల కంటే తక్కువ బ్యాలెన్స్‌ల మీద ఇచ్చే వడ్డీ రేటును 2.85 శాతం నుంచి 2.80 శాతానికి తగ్గించింది. సేవింగ్స్ ఫండ్ రూ.500 కోట్లు కంటే ఎక్కువ ఖాతా బ్యాలెన్స్‌పై 3.25 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 3 నుంచి అమలులోకి రానున్నాయి
పంజాబ్ & సిండ్ బ్యాంక్
పంజాబ్ & సిండ్ బ్యాంక్ కూడా ఫిబ్రవరి 1 నుంచి పొదుపు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ప్రభుత్వ రంగ రుణదాత ఇప్పుడు రూ.10 కోట్ల కంటే తక్కువ పొదుపు ఖాతా నిల్వలపై 3 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. ఇదిలా ఉండగా, రూ. 10 కోట్లు, అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్ మొత్తంపై 3.20 శాతం వడ్డీ రేటు ఇవ్వనున్నట్లు తెలిపింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ రేట్లు దేశీయ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు, అలాగే ఎన్ఆర్ఓ/ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వర్తిస్తాయి.
(చదవండి: కియా నుంచి మరో కొత్త మోడల్, కారు ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!)
Comments
Please login to add a commentAdd a comment