Hurun India Rich List: దేశవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాను 360 వన్ వెల్త్ అండ్ హురూన్ ఇండియా విడుదల చేసింది. దేశంలో అత్యంత ధనవంతుడిగా ముకేశ్ అంబానీ నిలిచారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఇందులో చోటు సంపాదించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
గతేడాది టాప్‌లో నిలిచిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ రెండో స్థానంలోకి చేరారు. ఆగస్టు చివరి నాటికి ఆయా వ్యక్తుల సంపద ఆధారంగా భారత్‌లోని 138 నగరాల నుంచి మొత్తం 1319 మంది హురూన్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు. వీటిల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 105 మంది ఉన్నారు. వీరిలో అయిదుగురు మహిళలకు స్థానం దక్కింది. మొత్తం అందరి సంపద విలువ ఏకంగా రూ.5.25 లక్షల కోట్లు. గతేడాదితో పోలిస్తే వీరి సంపద ఏకంగా 33 శాతం పెరగడం విశేషం. ఈ 105 మందిలో 87 మంది హైదరాబాద్ వారే కావడం గమనార్హం. కొత్తగా 33 మంది ఇందులో చోటు సంపాదించారు. వీరి ద్వారానే మొత్తం రూ.76 వేల కోట్లు జమైనట్లు తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది బిలియనీర్లు ఉన్నారు. దివీస్ మురళి రూ. 55,700 కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్‌కు చెందిన పిచ్చి రెడ్డి రూ.37,300 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
మేధా సర్వో డ్రైవ్స్ నుంచి అయిదుగురు ఈ లిస్ట్‌లో ఉన్నారు. హెటెరో ల్యాబ్స్ జి.పార్థసారధి రెడ్డి కుటుంబం రూ.21,900 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. అరబిందో ఫార్మా నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీవీ రామ్‌ప్రసాద్ రెడ్డి రూ. 21,000 కోట్ల సంపద, అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి కుటుంబం రూ.20,900 కోట్లు, మైహోం ఇండస్ట్రీస్ జూపల్లి రామేశ్వరరావు సంపద రూ.17,500 కోట్లుతో తరువాత స్థానాల్లో నిలిచారు. మహిళల్లో మహిమా దాట్ల మొదటి స్థానంలో నిలిచారు. ఈమె సంపద రూ.5700 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment