
చైనా వస్తువులపై అధిక సుంకాలు వేస్తానంటూ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక, భారత్ ఎగుమతులకు అనుకూలమని ఇండియా ఎగుమతి సంస్థల సమాఖ్య (FIEO) అభిప్రాయపడింది. ఏటా రూ.250 కోట్ల చొప్పున మూడేళ్ల పాటు మొత్తం రూ.750 కోట్ల సాయాన్ని ప్రకటించడం ద్వారా 25 బిలియన్ డాలర్ల విలువ మేర ఎగుమతులను (రూ.2.12 లక్షల కోట్లు) అదనంగా పెంచుకోవచ్చంటూ కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లింది.
2025–26 బడ్జెట్(Budget)కు సంబంధించి తమ డిమాండ్లను ఆర్థిక శాఖతో భేటీ సందర్భంగా ఎఫ్‌ఐఈవో తెలియజేసింది. ఐదు శాతం ఇంటరెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్‌ను (రాయితీ వడ్డీ రేటు) సైతం కొనసాగించాలని ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ అశ్విని కుమార్ డిమాండ్ చేశారు. చైనా(China) గతంలో ఆధిపత్యం ఎక్కువగా ఉన్న రంగాల్లో భారత్ గణనీయంగా ఎగుమతులు పెంచుకునేందుకు ఆ దేశంపై అమెరికా టారిఫ్‌లు వీలు కల్పిస్తాయని చెప్పారు. ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్, టెక్స్‌టైల్స్, గార్మెంట్స్, టోయ్స్, కెమికల్స్, ఆటో విడిభాగాలు, పాదరక్షలు, ఫర్నీచర్, హోమ్ డెకరేటివ్ ఉత్పత్తుల విభాగంలో చైనా స్థానాన్ని భారత్ ఆక్రమించగలదని ఎఫ్‌ఐఈవో నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది. వ్యూహాత్మక భాగస్వామ్యంతో యూఎస్‌కు ఎగుమతి(Export) చేయతగిన కీలక రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఎఫ్‌ఐఈవో ఈ భేటీలో భాగంగా కోరింది.
ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడు
రుణ వ్యయాలను తగ్గించాలి..
రాయితీ వడ్డీ రేటు పథకం గడువు 2024 డిసెంబర్ 31 వరకే ఉందని, అది కూడా రూ.50 లక్షలకు మించిన ఆదాయం ఉన్న ఎంఎస్‌ఎంఈకే వర్తిస్తున్నట్టు కుమార్ చెప్పారు. ఇతర దేశాలతో పోల్చితే భారత ఎగుమతిదారులు రుణాలపై అధిక వడ్డీ రేట్లను ఎదుర్కొంటున్నట్టు ఆర్థిక శాఖ దృష్టికి ఎఫ్‌ఐఈవో తీసుకెళ్లింది. దీంతో భారత ఎగుమతిదారులపై రుణ వ్యయాలు అధికంగా ఉంటున్నట్టు తెలిపింది. ఐఈఎస్ పథకాన్ని మరికొంత కాలం పాటు కొనసాగించడం వల్ల ఎగుమతి దారులు తక్కువ రేటుకే రుణాలు పొందే వెసులుబాటు లభిస్తుందని, దీంతో అంతర్జాతీయంగా పోటీ పడొచ్చని వివరించింది. పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) వ్యయాలపై పన్ను ప్రయోజనాలు, ప్రైవేటు రంగ షిప్పింగ్ సామర్థ్యాల పెంపునకు వీలుగా మూలధన వ్యయాలు అధికం చేయాలన్న డిమాండ్లను సైతం ఎఫ్‌ఐఈవో ఆర్థిక శాఖ ముందుంచింది. ఏటా షిప్పింగ్, రవాణా చార్జీలకే 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment