ముంబై: బ్యాంకింగేతర సంస్థ ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ రుణ మార్కెట్ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధపడుతోంది. మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీ ద్వారా రూ. 1,500 కోట్లు సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 300 కోట్ల విలువైన సెక్యూర్డ్ రీడీమబుల్ ఎన్‌సీడీలను విక్రయించనున్నట్లు తెలియజేసింది. వీటికి 9 శాతంవరకూ రిటర్నులను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 9న వీటిని జారీ చేయనున్నట్లు వెల్లడించింది. నిధులను వ్యాపారాభివృద్ధి, మూలధన పటిష్టతకు వినియోగించనున్నట్లు పేర్కొంది.
ఇష్యూకి అధిక సబ్‌స్క్రిప్షన్ లభిస్తే మరో రూ. 1,200 కోట్ల విలువైన ఎన్‌సీడీలను సైతం కేటాయించేందుకు గ్రీన్ షూ అప్షన్‌ను ఎంచుకున్నట్లు తెలియజేసింది. వెరసి రూ. 1,500 కోట్లను సమీకరించే వీలున్నట్లు తెలియజేసింది. 60 నెలల కాలానికిగాను ఇన్వెస్టర్లకు 9 శాతం వరకూ రిటర్నులను ఆఫర్ చేస్తున్నట్లు వెల్లడించింది. 24 నెలలు, 36 నెలల కాలావాధితోనూ బాండ్లను కేటాయించనున్నట్లు పేర్కొంది. వడ్డీని వార్షికంగా లేదా నెలవారీ చెల్లించనున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఏప్రిల్‌లో 40 కోట్ల డాలర్ల విలువైన డాలర్ బాండ్లను తిరిగి చెల్లించిన సంగతి తెలిసిందే. వీటిని 2020 ఫిబ్రవరిలో జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment