న్యూఢిల్లీ: ఇళ్ల ధరల సూచీలో 55 దేశాలకు గాను భారత్ 54 వ స్థానంలో నిలిచినట్టు నైట్‌ఫ్రాంక్ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్‌లో ఇళ్ల ధరలు 0.5 శాతం తగ్గినట్టు పేర్కొంది.
ఈ ఏడాది (2021) మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) భారత్ 55వ స్థానంలో ఉండడం గమనార్హం. టర్కీలో ఇళ్ల ధరలు 29.2 శాతం పెరగడంతో ర్యాంకుల్లో ఈ దేశం మొదటి స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌లో ధరలు 25.9 శాతం వృద్ధి చెందడంతో రెండో స్థానంలోనూ, యూఎస్ మూడో స్థానంలో (ఇళ్ల ధరలు 18.6 శాతం పెరుగుదల) ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లోని ప్రముఖ ప్రాంతాల్లో ఇళ్ల ధరలను ‘గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్’ కింద నైట్‌ఫ్రాంక్ పరిగణనలోకి తీసుకుని ఈ వివరాలను ప్రతీ త్రైమాసికానికి విడుదల చేస్తుంటుంది. 2021 రెండో త్రైమాసికంలో 18 దేశాల్లో ఇళ్ల ధరలు రెండంకెల స్థాయిలో పెరిగాయి. ఇళ్ల ధరలు కేవలం భారత్, స్పెయిన్‌లో మాత్రమే తగ్గాయి. రానున్న త్రైమాసికాల్లో ఇళ్లకు డిమాండ్ పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ విశ్లేషించారు.
Comments
Please login to add a commentAdd a comment