37% కంపెనీల్లో సానుకూల సెంటిమెంట్
ఫైనాన్షియల్, రియల్టీ, ఐటీ టాప్
మ్యాన్‌పవర్ గ్రూప్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: భారత కంపెనీలు నియామకాల పట్ల బలమైన ధోరణితో ఉన్నట్టు మ్యాన్‌పవర్ గ్రూప్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ సర్వే క్యూ4, 2024’ నివేదిక వెల్లడించింది. 37 శాతం భారత కంపెనీలు వచ్చే మూడు నెలల్లో (అక్టోబర్–డిసెంబర్) నికరంగా తమ సిబ్బందిని పెంచుకోనున్నట్టు ఈ సర్వేలో తెలిపాయి. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ కాలంలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 7 శాతం అధికం. క్రితం ఏడాది అక్టోబర్ - డిసెంబర్‌తో పోల్చి చూస్తే తటస్థంగా ఉంది.
వివిధ రంగాల్లోని 3,150 కంపెనీల అభిప్రాయాలను సర్వేలో భాగంగా మ్యాన్‌పవర్ గ్రూప్ తెలుసుకుంది. భారత్ తర్వాత కోస్టారికాలో అత్యధికంగా 36 శాతం కంపెనీలు, ఆ తర్వాత యూఎస్‌లో 34 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలంగా ఉన్నాయి. సిబ్బందిని తగ్గించుకునే కంపెనీలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నికర నియామకాల గణాంకాలను ఈ సంస్థ రూపొందించింది.
‘‘నియామకాల ఉద్దేశ్యం భారత ఆర్థిక వ్యవస్థ పట్ల సానుకూల ధోరణిని తెలియజేస్తోంది. విదేశీ విధానాలు, పెద్ద ఎత్తున మౌలిక వసతుల అభివృద్ధికి తోడు మనకున్న అధిక యువ జనాభా సానుకూలతలు అంతర్జాతీయ మార్కెట్లో భారత పోటీతత్వాన్ని పెంచుతాయి’’అని మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటి పేర్కొన్నారు.
రంగాల వారీగా..
మ్యానపవర్ గ్రూప్ సర్వే ప్రకారం.. దాదాపు అన్ని రంగాల్లోనూ నియామకాల పట్ల సానుకూలత వ్యక్తమైంది. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వచ్చే మూడు నెలల్లో 47 శాతం కంపెనీలు నియామకాల పట్ల సానుకూలంగా ఉంటే, ఐటీలో 46 శాతం, ఇండ్రస్టియల్స్, మెటీరియల్స్‌రంగాల్లో 36 శాతం, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రంగాల్లో 35 శాతం కంపెనీలు సిబ్బందిని పెంచుకోవాలని అనుకుంటున్నాయి. అతి తక్కువగా కమ్యూనికేషన్ సర్వీసెస్ రంగాలో 28 శాతం కంపెనీలే వచ్చే మూడు నెలల్లోనియామకాల పట్ల సానుకూలంగా ఉన్నాయి.
ఇదీ చదవండి: 6జీ టెక్నాలజీపై కేంద్రం దృష్టి: జ్యోతిరాదిత్య సింధియా
ఉత్తరాదిలో ఉద్యోగాల డిమాండ్ 41 శాతంగా ఉంటే, పశ్చిమాదిన 39 శాతంగా ఉంది. అధిక దేశీయ వినియోగం, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే పథకాలు, ఔట్‌సోర్స్ సేవల డిమాండ్ పెంచడం, తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నట్టు గులాటి తెలిపారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే.. భారత్ నిరుద్యోగాన్ని తగ్గించి, కొత్త తరహా పరిశ్రమల అవసరాలు తీర్చే మానవ వనరుల అభివృద్ధి ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయొచ్చని గులాటీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment