
మమతా మెషినరీ లిమిటెడ్ స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. డిసెంబర్ 19 గురువారం రోజున కంపెనీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ప్రారంభం అవుతుందని సంస్థ తెలిపింది. ఈ ఐపీవో ధర కంపెనీ రూ.179 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. అందుకు ఒక్కో షేరుకు రూ.230-243 ధర నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 23, 2024న ముగుస్తుంది.
ఈ సంస్థ ప్రధానంగా ప్యాకేజింగ్ యంత్రాల తయారీ, ఎగుమతి, వాటికి సర్వీస్ అందిస్తోంది. ప్లాస్టిక్ సంచులు, పౌచ్‌లు, ఎక్స్‌ట్రూషన్ పరికరాలను తయారు చేసే యంత్రాలను ఈ కంపెనీ తయారు చేస్తుంది. ప్యాకేజింగ్ పరిశ్రమలో ఎండ్-టు-ఎండ్ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్లను అందిస్తుంది. ఎక్కువగా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(ఎఫ్‌ఎంసీజీ), ఫుడ్ & బెవరేజ్ పరిశ్రమలకు సర్వీస్ చేస్తుంది. ఈ కంపెనీ తయారు చేసే యంత్రాలను ‘వెగా’, ‘విన్’ బ్రాండ్ పేర్లతో విక్రయిస్తున్నారు. 75కి పైగా దేశాలకు ఈ సంస్థ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఇదీ చదవండి: పాలసీపై రాబడి ఉండాలా..? వద్దా..?
ఐపీఓ అలాట్ అవ్వాలంటే..
ఒకటికి మించిన పాన్ కార్డుల ద్వారా ఐపీఓ దరఖాస్తు చేసుకుంటే షేర్ల అలాట్‌మెంట్ అవకాశాలు పెరుగుతాయి. మనలో కొంత మంది తమకున్న వివిధ డీమ్యాట్ ఖాతాల ద్వారా ఒకటికి మించిన బిడ్లు వేస్తుంటారు. కానీ, ఒకే పాన్ నంబర్‌పై ఒకటికి మించిన బిడ్లు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. అన్ని బిడ్లు తిరస్కరణకు గురవుతాయి. ఒకటికి మించిన బిడ్లు వేయడం సెబీ నిబంధనలకు విరుద్ధం. దీనికి బదులు తల్లిదండ్రులు, సోదర సోదరీమణులు, జీవిత భాగస్వామి పేరిట దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పాన్ నంబర్లతో దరఖాస్తులు సమర్పించడం వల్ల షేర్లు కచ్చితంగా వస్తాయని చెప్పలేం. కానీ కేటాయింపుల అవకాశాలు కచ్చితంగా మెరుగుపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment